క‌డ‌ప బ‌రిలో భార‌తి..వార్ వ‌న్ సైడ్ కోస‌మేనా?

Update: 2019-02-04 07:01 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జ‌ర‌గ‌నున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు కొన్నిరాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నా.. అవేమీ ఏపీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే నామ‌మాత్రమేన‌ని చెప్పాలి.  పోటాపోటీగా సాగుతాయ‌ని భావిస్తున్న ఏపీ అసెంబ్లీ  ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార‌.. విపక్షాలు వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్ని సిద్ధం చేస్తున్నాయి. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలా అయినా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా ఈ ఎన్నిక‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో చేసిన త‌ప్పుల్ని ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో చోటు చేసుకోకూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తి సీటు కీల‌క‌మైన‌దిగా భావిస్తున్న ఆయ‌న‌.. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ప్లాన్ ఏ.. ప్లాన్ బి అన్న‌ట్లుగా ముందుస్తు వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా క‌డ‌ప ఎంపీ స్థానానికి  జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

జ‌గ‌న్ పార్టీ పెట్టిన నాటి నుంచి చెల్లెల్ని.. త‌ల్లిని త‌ప్పించి భార్య‌ను ఏ రోజు రాజ‌కీయ బ‌రిలో నిల‌ప‌ని జ‌గ‌న్‌.. ఈసారి అందుకు భిన్నంగా భార‌తిని దించాల‌న్న ఆలోచ‌న వెనుక అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని చెబుతున్నారు. క‌డ‌ప ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో అవినాశ్ రెడ్డి బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వారిలో అవినాష్ రెడ్డి ఒక‌రు. ఇదిలా ఉంటే.. 2014 ఎన్నిక‌ల వేళ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌ర్వాతి కాలంలో జ‌గ‌న్‌పార్టీకి రాజీనామా చేసి. .టీడీపీలో చేర‌టం రాష్ట్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టం తెలిసిందే.

త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి రాంసుబ్బారెడ్డితో రాజీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబు.. అందులో కొంత స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. తాజాగా జ‌రుగుతుఉన్న ఎన్నిక‌ల్లో రాంసుబ్బారెడ్డిని జ‌మ్ముల‌మ‌డుగు నుంచి బ‌రిలోకి దింపి.. ఆదిని క‌డ‌ప ఎంపీగా పోటీకి దించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. క‌డ‌ప ఎంపీ స్థానానికి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే బ‌ల‌మైన అభ్య‌ర్థి ఆదినారాయ‌ణ రెడ్డి త‌ప్పించి మరొక‌రు లేని ప‌క్షంలో.. ఆయ‌న్ను ఒప్పించి బ‌రిలోకి దింపటం ఖాయ‌మంటున్నారు. ఒక‌వేళ బాబు మాట‌ల‌కు ఆది ఓకే చెబితే.. పోటీ తీవ్రంగా మార‌టం ఖాయం.

త‌న సొంత జిల్లాలోని తాను ప్రాతినిధ్యం వ‌హించిన క‌డ‌ప ఎంపీ స్థానాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో చేజార్చుకోవ‌టానికి సిద్ధంగా లేని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఆది కానీ బ‌రిలోకి దిగితే అందుకు త‌గ్గ‌ట్లు భార‌తిని త‌మ‌ పార్టీ అభ్య‌ర్థిగా పోటీకి దించుతార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే భార‌తి విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ఆది కాకుండా మ‌రొక‌రు ఎవ‌రైనా క‌డ‌ప ఎంపీ స్థానానికి బ‌రిలోకి దిగితే అవినాష్ రెడ్డినే దించుతార‌ని.. ఆది అయితే మాత్రం భార‌తి తెర మీద‌కు వ‌స్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. వార్ వ‌న్ సైడ్ అని వేరే చెప్పాలా?
Tags:    

Similar News