టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న జ‌గ‌న్‌

Update: 2016-08-11 11:26 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం సుముఖంగా లేక‌పోవ‌డంతో తెలుగుదేశం పార్టీ రూటు మార్చేసింది. ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ను మానసికంగా తెరమరుగు చేసి, ప్యాకేజీని తెరపైకి తీసుకువస్తోంది. కేంద్రం నుంచి ఆ మేరకు సంకేతాలు రావడంతో హోదా డిమాండును అటకెక్కించి, ప్యాకేజీకి అధిక ప్రచారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలను కూడా ఆ మేరకు మానసికంగా సిద్ధం చేసే ప్రచారానికి పదునుపెట్టింది.  ఇటీవల ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి ఒకరు కొద్దిమంది జర్నలిస్టులతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఇదే వ్యూహం బయటపెట్టారు. అయితే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇందుకు ధీటుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ప్ర‌త్యేక‌ హోదా బదులు, ప్యాకేజీ గురించి తరచూ మాట్లాడుతుండటం కూడా వ్యూహంలో భాగమ‌నే అంటున్నారు. హోదా రాదని జనాలకు దాదాపు స్పష్టమయినందున, దాని బదులు ప్యాకేజీ కోసం తమ పార్టీ పోరాడుతుందన్న సంకేతాలిచ్చే పనిలో తెదేపా బిజీగా ఉంది. తాజాగా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఈ అంశాన్ని విశ్లేషిస్తూ....ఏపీకి ప్యాకేజీ మాత్రమే ఇస్తారని, హోదా ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు. తాము కూడా దాని కోసం పట్టుపట్టే పరిస్థితిలో లేమని అన్నారు. ప్రజలు కూడా ఏదో ఒకటి వస్తే చాలనుకుంటున్నారే తప్ప, హోదా గురించి పట్టుదలతో లేనందున, ప్యాకేజీ వచ్చినా సంతోషిస్తారని విశ్లేషించారు. హోదా ఇవ్వకపోయినా దానికంటే ఎక్కువ ఉపయోగం ఉన్న ప్యాకేజీ ఇవ్వాలన్న వాదన తెరపైకి రావడం వెనుక మతలబు కూడా అదేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. వారం క్రితంవరకూ హోదాపై పోరాటం పేరుతో హడావుడి చేసిన తెదేపా నాయకులు, కొద్దిరోజులుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. హోదా ఇవ్వకపోతే బీజేపీ నేతలను రాష్ట్రంలో అడుగుపెట్టనీయవద్దని, ఆ పార్టీతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసిన నేతలంతా ఇప్పుడు మౌనం వహించడం అన్ని వర్గాలను విస్మయపరుస్తోంది. అయితే, కేంద్రం నుంచి ప్యాకేజీకి సంబంధించి కచ్చితమైన హామీ వచ్చిన తర్వాతనే తెదేపా వ్యూహం మార్చుకుందని సమాచారం. ప్యాకేజీపై హామీ లభించినందున హోదాపై ఇక ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నాయకత్వం నేతలను ఆదేశించిందని తెలుస్తోంది. నిజానికి కీలకమైన అంశాలపై తెదేపా రాష్ట్ర కార్యాలయమే ఒక నోట్ రూపొందిస్తుంది. దానిని ఆయా జిల్లా పార్టీ కార్యాలయాలకు, ఉదయం టీవీ చర్చలకు వెళ్లే నేతలకు, ఆ రోజు విలేఖరుల సమావేశాలు నిర్వహించేవారికి పంపిస్తుంటుంది. ఆ ప్రకారంగా ఏ మోతాదులో విమర్శలు ఉండాలి? ఎవరిని ఎక్కువగా విమర్శించాలి? అన్న అంశం పార్టీ కార్యాలయమే నిర్ణయిస్తుంది. హోదాపై తెదేపా నేతలు వారం రోజులు చేసిన హడావుడి, బీజేపీ, ప్ర‌ధాన‌మంత్రి మోదీపై విమర్శల యుద్ధం అన్నీ పార్టీ విధాన నిర్ణయం మేరకు జరిగినవేన‌ని టాక్‌.

అయితే, ప్యాకేజీ పేరుతో ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలన్న తెదేపా వ్యూహాన్ని కనిపెట్టిన వైసీపీ అధినేత జగన్ హోదా గురించి తరచూ ఒత్తిడి చేస్తున్నారు. ప్యాకేజీ వల్ల ఏమీ రాదని, హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఓటుకునోటు, లక్షకోట్ల అవినీతికి పాల్పడినందున బాబు హోదా కోసం పోరాడే అవకాశం లేదని విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీని అనుమతించే ప్రశ్న లేదని, తమకు హోదానే కావాలని జగన్ గళమెత్తడం తెదేపాను రాజకీయంగా ఇరుకునపెట్టేందుకేననేది స్పష్టమవుతోంది.
Tags:    

Similar News