వైఎస్ జ‌గ‌న్ కోడిక‌త్తి కేసులో సంచ‌ల‌న ప‌రిణామం ఇదే!

Update: 2022-07-09 08:30 GMT
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలోని ఒక రెస్టారెంటులో కోడిక‌త్తితో ఓ యువ‌కుడు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేకెత్తించింది.

వైఎస్ జ‌గ‌న్ వీఐపీ లాంజ్ లో ఉండ‌గా వ‌చ్చిన ఓ యువ‌కుడు పందెం కోళ్ల‌కు క‌ట్టే క‌త్తితో వైఎస్ జ‌గ‌న్ భుజానికి గాయం చేశాడు. ఈ ఘ‌ట‌న టీడీపీ, వైఎస్సార్సీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది. వైఎస్ జ‌గ‌న్ కావాల‌ని సానుభూతి కోసం నాట‌కాలు ఆడుతున్నాడ‌ని అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం ఆరోపించింది.

2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం జగన్‌.. హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగ‌తి తెలిసిందే.

కాగా ఈ కేసులో తాజా ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోడి క‌త్తి కేసులో నిందితుడు త‌న కుమారుడు శ్రీనివాస్ ను విడుద‌ల చేయాల‌ని అత‌డి త‌ల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ‌కు లేఖ రాశారు.

ఈ కేసులో త‌న కుమారుడిని నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా కొన‌సాగిస్తున్నార‌ని వాపోయారు. న్యాయ‌స్థానం, జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎలాంటి విచార‌ణ జ‌రిపించ‌డం లేద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దృష్టికి తెచ్చారు.

కాగా కోడిక‌త్తితో దాడి చేసిన‌ప్పుడు సంఘటనా స్థలంలోనే నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. సెల్పీ కావాలంటూ జగన్ వద్దకు వెళ్లిన నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడిచేశాడు. వెంటనే అప్రమత్తమైన జగన్ భద్రతా సిబ్బంది.. ఆయనను తప్పించారు.

అయితే ఈ కేసులో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్ఐఏ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిపై చార్జిషీటును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో కోర్టు ఎలాంటి విచారణ జరపడం లేదని శ్రీనివాస్ తల్లి సావిత్రి ఆరోపణ. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాశారు.
Tags:    

Similar News