ప్రత్యేక హోదాపై జ‘గన్’ ఫైరింగ్ ఉధృతమైంది

Update: 2016-09-26 06:27 GMT
మొన్నటికి మొన్న ఏలూరులో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై యువతతో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా ప్రవాసాంధ్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మీద తన అభిప్రాయాల్ని వెల్లడించారు. విభజన కారణంగా జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం చేసిన ఆయన.. హైదరాబాద్ నగరం ఏపీకి లేకుండా పోవటం వల్ల 98 శాతం కంపెనీల్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

ప్రత్యేక హోదాతో అన్ని వస్తాయని చెప్పిన జగన్.. హోదా వస్తే ఆదాయపన్నుకట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలూ వ‌స్తాయ‌ని చెప్పారు. హోదా ఇచ్చేది లేదన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గు లేకుండా స్వాగతించారన్న జగన్.. జైట్లీ ప్రకటనను మొత్తంగా చూస్తే.. ఎవరూ థ్యాంక్స్ కూడా చెప్పరన్నారు. ఏపీకి రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు దాన్ని ప్యాకేజీ అని ఎలా అంటారని సూటిగా ప్రశ్నించిన జగన్..ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీ ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. హోదా కోసం తాము ఆందోళనలు చేస్తుంటే వాటిని నీరుగార్చే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పిన జగన్.. ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలు ఇచ్చారు.

వ్యవస్థలో మార్పురావాలని, నేతల్ని నిలదీసే రోజు రావాలన్న జగన్.. చంద్రబాబులాంటి అబద్దాలకోరు ఎవరూ ఉండరన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నఆయన.. పోలవరం ప్రాజెక్టు నిబంధనల్ని అడ్డగోలుగా మార్చేసినట్లు ఆరోపించారు. ప్రత్యేక హోదాతో యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి ప్రదర్శిస్తారన్నారు.

ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతామన్న జగన్.. ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రులే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘‘ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. ప్రజాసంఘాలు.. కమ్యూనిస్ట్ లతో కలిసి ముందుకు సాగుతున్నట్లుగా జగన్ చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున నిజాయితీగా పోరాడుతున్న తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నార‌ని ఆరోపించారు. విభజన ఇష్యూలో యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఏపీలో కాంగ్రెస్ ఎలా చతికిలపడిందో.. ప్రస్తుతం హోదా విషయంలో బీజేపీ.. టీడీపీల పరిస్థితి కూడా అలానే ఉంటుందన్నారు.

14వ ఆర్థిక సంఘం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదని.. ఆ విషయం ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉన్న జమ్ముకశ్మీర్ కు మోడీ సర్కారు రూ.80వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారని.. మరి అలాంటప్పుడు హోదా లేనట్టా? అని ప్రశ్నించారు. 2019లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. 280 సీట్లు వచ్చే పరిస్థితి ఎవరికీ ఉండదని.. అలాంటి పరిస్థితుల్లో 22 సీట్లు గెల్చుకుంటే కేంద్రాన్ని కోరుకున్నది డిమాండ్ చేసి సాధించుకోవచ్చన్నారు. వినుకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్యేక హోదా ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ లో కంపెనీ పెట్టారని.. దీన్ని ఏమనాలంటూ ఏపీ ముఖ్యమంత్రికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వ్యాఖ్యానించారు. మొత్తంగా జగన్ తీరు చూస్తుంటే.. హోదా మీద ఆయన ఫైరింగ్ ఉధృతం అవుతున్నట్లుగా కనిపించక మానదు.
Tags:    

Similar News