500 కిలో మీట‌ర్లు..జ‌గ‌న్ ఖాతాలో ఓ ప్ర‌త్యేక రికార్డు

Update: 2017-12-16 16:59 GMT
ప్రజల యొక్క.. ప్రజల చేత.. ప్రజల కొరకు.., ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమానికి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ నడుంబిగించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ తో జననేత వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి  నవంబర్‌ 6 నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుందనే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సుదీర్ఘ ల‌క్ష్యంలో వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌మైలురాయి చేరుకున్నారు. దారిపొడవునా జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జగ‌న్ ముందుకు సాగుతున్నారు

ఏపీ ప్ర‌ధాన‌ ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. 36వ రోజు అనంత‌పురం జిల్లా గొట్లూరు వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర 500 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. ఈ క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ ప‌లు కీల‌క మైలురాళ్లు సాగార‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. తండ్రి తీరుగానే ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న యువనేతను ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్ర‌ధానంగా దివంగ‌త వైఎస్ హ‌యాంలో అమ‌ల్లో ఉన్న కీల‌క సంక్షేమ ప‌థకాలు ఇప్పుడు అట‌క ఎక్క‌డంపై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 108 అంబులెన్సు - పేదలకు ఉచిత వైద్యం ఇచ్చిన ఆరోగ్యశ్రీ - విద్యార్థుల భవతకు బంగారు బాటలు వేసిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలన్నీ ఇప్పుడు అగ‌మ్య గోచ‌ర స్థితిలో ఉన్నాయ‌నే భావ‌న జ‌గ‌న్‌ను క‌లిసిన వారు వెల్ల‌డిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ సంద‌ర్భంగానే ప‌లు కీల‌క అంశాలు తెర‌మీద‌కు తెస్తున్నార‌ని అంటున్నారు. భూసేకరణ ప్ర‌జా కంట‌కంగా మారింద‌ని, కబ్జాలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు ఉద్యోగం లేక - ఇస్తానన్న నిరుద్యోగభృతి కూడా అందక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ బ‌లోపేతం ప‌రంగా కూడా వైఎస్ జ‌గ‌న్ ప్లాన్ చేశార‌ని చెప్తున్నారు. నియోజకవర్గానికి ఒక భారీ బహిరంగ సభ ఉండేలా పాదయాత్రను ప్లాన్‌ చేశారు. త‌ద్వారా ఆ స్థానిక స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటే అవ‌కాశం దొరికింది. అక్క‌డికక్క‌డే వాటిని ప్ర‌స్తావించ‌డం..ప్రభుత్వాన్ని నిల‌దీయడం...తాము అధికారంలోకి వ‌స్తే..ఏం చేస్తామో చెప్ప‌డం ద్వారా...ప్ర‌జ‌ల‌కు క్షేత్ర‌స్థాయిలో వైఎస్ జ‌గ‌న్ మ‌రింత చేరువ అయ్యారు. జ‌గ‌న్ యాత్ర‌లో ప్రధానంగా యువ‌త‌ - మ‌హిళ‌లు - మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మెజార్టీగా హాజ‌ర‌వుతుండ‌టం వైసీపీ వ‌ర్గాలకు మ‌రింత ఉత్సాహాన్ని అందిస్తోంది.

త‌న‌ను క‌లిసిన వారందరికీ భరోసానిచ్చి నవరత్నాలను మీకు అందిస్తానని హామీ ఇస్తున్నారు వైఎస్ జగన్. ప్రజలు దిద్దే మేనిఫెస్టోతో సమస్యలన్నీ తీరుస్తానని చెబుతున్నారు. ప్రత్యేక హోదా - ఎస్సీ - ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ - ప్రతిమండలంలోనూ వృద్ధులకు ఆశ్రమాలు - పింఛన్ల పెంపు - రైతులకు పంట నూర్పిడికి ముందే మద్దతు ధర - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇలా అన్ని వర్గాలకూ అవసరమైన పథకాలను అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు జ‌గ‌న్‌. ఒక్క ఏడాది ఓపికపడితే మన పాలన - మీ పాలన వస్తుందని - మీరు కోరుకున్నవన్నీ జరుగతాయని హామీ ఇస్తున్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పని చేయాలని - వైఎస్సార్ ఫొటో పక్కనే నా ఫొటో కూడా పెట్టుకునేలా చేస్తానని - మీ ఆశీర్వాదం కావాలని వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు.
Tags:    

Similar News