ష‌ర్మిల‌ది పాద‌యాత్ర‌నా.. వాకింగా.. క‌న్ఫ్యూజ్ వ‌ద్దు.. ఇది చ‌ద‌వండి!

Update: 2021-10-19 14:30 GMT
తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయ పార్టీ పెట్టిన వైఎస్ త‌న‌య‌, ఏపీసీఎం జ‌గ‌న్ చెల్లెలు.. రేప‌టి నుంచి (అక్టోబ‌రు 20)  పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అయితే.. ఇది పాద‌యాత్రా..?  లేక వాకింగా? అనేది చ‌ర్చ‌గా మారింది. ఇక‌, ఇప్ప‌టికే ఆమె త‌మ కుటుంబ ఆన‌వాయితీ ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లాలోని త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి.. ప్రార్థ‌న‌లు చేశారు. త‌ను నిర్వ‌హించ‌బోయే పాద‌యాత్ర‌/వాకింగ్‌కు శ‌క్తి ఇవ్వాలంటూ.. ఆమె తండ్రిని వేడుకున్నారు. స‌రే.. అస‌లు ఇది పాద‌యాత్రేనా? అనే సందేహాల నేప‌థ్యంలో విష‌యం ఏంటో మీరే చూడండి!!

ఏపీ సీఎం,తోడ‌బుట్టిన‌ అన్న జ‌గ‌న్‌తో కొన్న విభేదాలు రావ‌డంతో తెలంగాణలో ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల పార్టీ పెట్టార‌నే ప్ర‌చారం ఉంది. ఇదే రాజ‌కీయ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. పార్టీ పెట్టి చాన్నాళ్లు అయినా.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మాజీ వార్డు స‌భ్యుడు కానీ.. ఒక్క గౌర‌వ‌నీయ నాయ‌కుడు కానీ.. ష‌ర్మిల పార్టీలో చేర‌లేదు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల ష‌ర్మిల బంజారాహిల్స్‌లో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకేతో క‌లిసింద‌ని తెలిసింది. ఐప్యాక్‌లోకానీ, ఆమె రాజ‌కీయ కార్యాల‌యంలో కానీ వీరిద్ద‌రూ భేటీ అయిన‌ట్టు స‌మ‌చారం.

పీకే-ష‌ర్మిల‌లు.. ఎక్క‌డ భేటీ అయ్యార‌నేది ర‌హ‌స్యంగానే ఉన్నా.. మొత్తానికి ఇద్ద‌రూ భేటీ అయ్యార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ భేటీలో పీకే కొన్ని `నిజాలు`ష‌ర్మిల చెవిలో వేశార‌ని అంటున్నారు. అదేంటంటే.. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి వ‌ల‌స‌లు ఉండ‌బోవ‌ని! అదెలా అంటే.. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉండి ఉంటే.. మీ పార్టీలోకి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు వ‌చ్చి ఉండేవార‌ని.. కానీ, ఇప్పుడు యువ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేప‌ట్ట‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెరిగి.. ఎవ‌రూ పార్టీని వీడే ప‌రిస్థితి లేద‌ని పీకే కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతేకాదు.. ఇప్పుడు రాజ‌కీయం చేయ‌డం అంత ఈజీకాద‌ని కూడా చెప్పిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. అయితే.. ష‌ర్మిల మాత్రం తాను దూకుడుగా ముందుకు వెళ్తాన‌ని.. మీరు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పీకే ముందు.. త‌న పాద‌యాత్ర షెడ్యూల్ పెట్టార‌ట ష‌ర్మిల‌. మొత్తం 90 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేస్తున్నాన‌ని.. అక్టోబ‌రు 20 నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తున్నాన‌ని ఆమె వివ‌రించారట‌. అయితే.. పార్టీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఉన్న‌వారు ముగ్గురు మాత్ర‌మే. కొండా రాఘ‌వ‌రెడ్డి, పిట్టా రాం రెడ్డి, ఇప్పుడు సోమ‌న్న‌. వీరిలో సోమ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డంలోను, పాట‌లు పాడ‌డంలోనూ దిట్ట కావ‌డంతో అత‌నికి ఎమ్మెల్యే టికెట్ కూడా  క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

వీళ్లు ముగ్గురు త‌ప్పితే.. ఎవ‌రూ ష‌ర్మిల పార్టీలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీరికి కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా జోష్ లేదని అంటున్నారు. ఇదిలావుంటే.. ష‌ర్మిల పాద‌యాత్ర గురించి ఎవ‌రిని అడిగినా.. అది పాద‌యాత్ర కాదు.. కేవ‌లం ష‌ర్మిల‌కు ఒక టైం పాస్ మాత్ర‌మేన‌ని.. పాద‌యాత్ర పేరుతో వాకింగ్ చేస్తార‌ని ఎద్దేవా చేస్తున్నారు. వాస్త‌వానికి ష‌ర్మిల అజెండా ఏంటంటే.. వైఎస్సార్ సంక్షేమ ప‌థ‌కాలు.. రాజ‌న్న పాల‌న‌ను అందించ‌డం. ఇవి త‌ప్ప ష‌ర్మిల ముందు మాట్లాడేందుకు ఏమీ క‌నిపించ‌డం లేదు.

ఇక‌, ష‌ర్మిల ఎంత గొంతు చించుకుని మాట్లాడుతున్నా.. పెద్ద పార్టీలు ప‌ట్టించుకోవ‌డం లేదు. కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌డం లేదు.  కాంగ్రెస్ నాయ‌కులు కూడా ష‌ర్మిల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక పోగా.. మా రాజ‌న్న కుమార్తె, అన్న‌తో ఏదో గొడ‌వ‌లు ప‌డి.. ఇక్క‌డ‌కు వ‌చ్చింది. సో.. చీర సారె పెట్టి.. పంపిస్తాం.. అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, టీఆర్ ఎస్ మాత్రం అస‌లు ష‌ర్మిల‌ను లెక్క‌లోకి కూడా తీసుకోవ‌డం లేదు. మ‌రోపార్టీ బీజేపీ అస‌లు ఆమె ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో అంటే.. ఎవ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితిలో ష‌ర్మిల ప్రారంభిస్తున్న‌ది పాద‌యాత్ర‌నా?  లేక జ‌స్ట్ వాకింగా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి చూద్దాం.. ఏం తేలుతుందో!!


Tags:    

Similar News