జగన్ బుద్ధుండే ఆ మాట అన్నారా?

Update: 2015-12-08 09:21 GMT
ఏపీలో విపక్ష నేత - వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి మంగళవారం అనూహ్య ప్రకటన చేశారు.. ఆవేశంలో చేశారో, ఆలోచనతో చేశారో తెలియదు కానీ తన ప్రకటనతో పొలిటికల్ మైలేజి పెంచుకునే ప్రయత్నం చేశారు. విజయవాడలో కల్తీ మద్యం కారణంగా చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించిన ఆయన ''మా ప్రభుత్వం వస్తే మద్యం నిషేధం అమలు చేస్తాం" అన్నారు. బుద్ధి ఉన్నోడు ఎవడైనా సరే మద్య నిషేధం చేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారో, చేయరో తనకు తెలియదని వ్యంగంగా అంటూ తాము అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే... జగన్ తండ్రి, ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ బుద్దున్నోళ్ల లిస్టులో ఉన్నారో లేదో చెప్పాలని టీడీపీ నేతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కౌంటరేశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్ ఆ సందర్భంగా మాట్లాడుతూ  చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం రోజురోజుకీ ప్రజలను మద్యానికి బానిసలను చేయాలని ప్రయత్నిస్తోందని... మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం కూడా పోస్తున్నారని, దీనికి బాధ్యత ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం దుకాణం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉందని, అయినప్పటికీ ఆ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. బీహార్ కూడా మద్యం నిషేధం దిశగా అడుగేసిందన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మద్యం నిషేధం చేస్తాడని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారో, చేయరో తనకు తెలియదన్నారు. 2019లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అప్పుడు సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారు.

అయితే... తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పడం వరకు బాగానే ఉన్నా బుద్దున్నోడెవడైనా ఆ పనిచేస్తాడని అనడంతో జగన్ కాస్త ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయలేదు. కానీ, గతంలో చంద్రబాబు ఓసారి మద్యం నిషేధం అమలు చేశారు. దీంతో బుద్ధి లేనిది చంద్రబాబుకు కాదని రాజశేఖరరెడ్డికేనని జగన్ పై రివర్స్ కౌంటర్లేస్తున్నారు టీడీపీ నేతలు.
Tags:    

Similar News