'బ్లాక్‌' బాబుపై! ... వైసీపీ పంచ్ అదిరింది!

Update: 2019-02-01 11:26 GMT
తెలుగు నేల విభ‌జ‌న నేప‌థ్యంలో రాజ‌ధాని కూడా లేకుండా తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త ప్ర‌యాణం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిర‌సిస్తూ ప్ర‌జా సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ కు అధికార టీడీపీ కూడా మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం అసెంబ్లీకి వ‌చ్చిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... న‌లుపు రంగు దుస్తుల్లో స‌రికొత్త రూపంలో క‌నిపించారు. కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గా త‌నతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మంత్రులు... అంద‌రూ న‌లుపు రంగు చొక్కాల‌తోనే స‌భ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసిన చంద్ర‌బాబు... తాను కూడా అదే రంగు చొక్కాలో వ‌చ్చారు. నాలుగేళ్ల పాటు బీజేపీ చేస్తున్న మోసాల‌ను - అన్యాయాల‌ను క‌ప్పిపుచ్చుకుంటూ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పిన ప్ర‌తి మాట‌కు గంగిరెద్దులా త‌లూప‌డంతో పాటుగా రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేస్తున్న మోదీ నిర్ణ‌యాల‌ను ఆహా ఓహో అంటూ కీర్తించిన చంద్ర‌బాబు... న‌లుపు రంగు చొక్కా ధ‌రించ‌డంలో మాత్రం చాలా ఆల‌స్యం చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇదే అంశంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ... న‌లుపు రంగు చొక్కాలో క‌నిపించిన చంద్రబాబుపై త‌న‌దైన శైలి పంచ్ విసిరింది. వైసీపీ విశాఖ న‌గ‌ర క‌న్వీన‌ర్ గుడివాడ అమ‌ర్ నాథ్ పేరిట ఆ పార్టీ ట్విట్ట‌ర్ ఖాతాలో క‌నిపిస్తున్న ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌ గా మారిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగిస్తున్న పార్టీగా వైసీపీ మంచి మైలేజీనే సాధించింది. ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు - హోదా రాకుంటే జ‌రిగే న‌ష్టాలు - రాష్ట్రం కోల్పోయే ఆదాయాన్ని జ‌నానికి వివ‌రించేందుకు ఆ పార్టీ అధినేత జిల్లాల్లో యువ భేరీల పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు జ‌నం నుంచి ప్ర‌త్యేకించి యువ‌త నుంచి మంచి స్పంద‌న వ‌చ్చేసింది. ఇదే రీతిన యువ భేరీలు జ‌రిగితే... త‌మ ప‌ర‌ప‌తి ఏం కావాల‌న్న డైల‌మాలో ప‌డిపోయిన టీడీపీ స‌ర్కారు... యువ‌భేరీల‌కు వెళితే కేసులు పెడ‌తామంటూ విద్యార్థుల‌ను బెదిరించిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. హోదా కోసం సాగిస్తున్న ఉద్య‌మంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ 2015లోనే న‌ల్ల చొక్కా వేసుకుని నిర‌స‌న తెలిపారు.

ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన గుడివాడ అమ‌ర్‌ నాథ్.. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్త‌డంతో పాటుగా న‌లుపు రంగు చొక్కాతో జ‌గ‌న్ 2015లోనే నిర‌స‌న తెలిపార‌ని గుర్తు చేశారు. అయితే త‌మ పార్టీ అధినేత చేసిన నిర‌స‌న‌ను ఏపీ సీఎం హోదాలో చంద్ర‌బాబు నాలుగేళ్ల త‌ర్వాత గానీ గుర్తించ‌లేకపోయార‌ని కూడా త‌న‌దైన సెటైర్ వేశారు. అయినా ఇప్పుడు చంద్ర‌బాబు మేనిపైకి వ‌చ్చిన న‌ల్ల చొక్కాకు కార‌ణం ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం కాద‌ని, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌ట‌మేన‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి వ్యంగ్యాస్త్రం సంధించారు. బాబువ‌న్నీ అవుట్ డేటెడ్ ఆలోచ‌న‌ల‌ని ఇటీవ‌లే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా చేసిన వ్యాఖ్య‌ల మాదిరే... బాబు నిర‌స‌న‌లు కూడా కాలం చెల్లిన‌వేన‌ని సెటైర్ వేశారు. మొత్తంగా చంద్ర‌బాబు త‌న ఆలోచ‌న‌ల‌తో పాటు ఆందోళ‌న‌ల విష‌యంలోనూ అవుడ్ డేటెట్ నేత‌గానే మిగిలిపోతున్నార‌న్న కోణంలో గుడివాడ పంచ్ ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌ గా మారిపోయింది.
Tags:    

Similar News