'గుర‌జాల‌' అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణకు డిమాండ్!

Update: 2018-08-15 11:28 GMT
గుంటూరు జిల్లా గుర‌జాల నియోజ‌క వ‌ర్గంలో వెలుగులోకి వ‌చ్చిన అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. సాక్ష్యాత్తూ గురజాల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు క‌నుస‌న్న‌ల్లోనే 290 కోట్ల విలువైన‌ అక్ర‌మ మైనింగ్ జ‌రిగింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంలో య‌ర‌ప‌తినేనికి హైకో్ర్టు నోటీసులు కూడా పంపించింది. అక్ర‌మ మైనింగ్ పై త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 21న జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 13 వ‌తేదీన‌ పిడుగురాళ్ల - దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్వారీల‌లో ప‌ర్య‌టించేందుకు వెళ్లిన‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీ స‌భ్యుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల వైసీపీ నేత‌ల‌ను హౌస్ అరెస్టు - అరెస్టు చేశారు. దీంతో, అక్ర‌మ మైనింగ్ ప్రాంతంలో వైసీపీ నేత‌ల ప‌ర్య‌ట‌నకు అనుమతినిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ 10 రోజుల డెడ్ లైన్ విధించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై గుర‌జాల వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కాసు మ‌హేష్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అక్రమ మైనింగ్‌ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాము ప్ర‌భుత్వానికి ఇచ్చిన 10 రోజుల గ‌డువులోపు త‌మ ప‌ర్య‌ట‌నకు అనుమ‌తినివ్వాల‌ని, లేకుంటే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. అక్ర‌మ మైనింగ్ లో ప్రధాన సూత్రధారి అయిన యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకే అమాయకులపై కేసులు పెడుతున్నారని కాసు మ‌హేష్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఐడీ విచారణ వల్ల ఒరిగేదేమీలేద‌ని, అందుకే ఆ వ్య‌వ‌హారంలో సీబీఐ విచారణ జరిపించాల‌ని డిమాండ్ చేశారు. సిబీఐ ఎంక్వ‌యిరీ జ‌రిగితే...నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. గ‌తంలో దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు....ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంద‌ర్భంలో...నిర్భ‌యంగా సీబీఐ విచార‌ణ జ‌రిపించార‌ని గుర్తు చేశారు. ఓబులాపురం మైనింగ్ వ్య‌వ‌హారంలో అఖిల‌ప‌క్షాన్ని కూడా మైనింగ్ జ‌రిగిన ప్రాంతానికి పంపించార‌ని....ఇపుడు చంద్ర‌బాబు అలా ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న భూములను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలని మ‌హేష్ అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద అక్ర‌మ మైనింగ్ కుంభకోణం జరిగితే.. బీజేపీ - కాంగ్రెస్‌ - జనసేన పార్టీలు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News