ఈ అరెస్ట్ లు అవసరమా చంద్రబాబు?

Update: 2016-08-02 08:15 GMT
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ విపక్షాలు ‘ఏపీ బంద్’కు పిలుపునివ్వటం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రోడ్ల మీదకు వచ్చేశారు. బంద్ అన్న వెంటనే ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకు రాకుండా ఉండటం.. దుకాణాల్నిమూయించటం లాంటివే జగన్ పార్టీ నేతలు షురూ చేశారు. బంద్ ను దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ప్రైవేటు కంపెనీలు కూడా సెలవును ప్రకటించాయి.

చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లోనే ఏపీ బంద్ ఉదయం నుంచే షురూ అయ్యింది. విపక్షాలన్నీ బంద్ కు పిలుపు ఇచ్చినప్పటికీ.. ఏపీ ప్రధానప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల జోరు ఎక్కువగా కనిపించింది.  బంద్ సందర్భంగా నిరసన ప్రదర్శనలు.. బైక్ ర్యాలీలు.. ధర్నాలు చేపట్టారు. చాలా చోట్ల బంద్ సందర్భంగా పలుచోట్ల  నేతలు.. గులాబీ పూలు ఇచ్చి గాంధీ గిరి ప్రదర్శించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బంద్ సందర్భంగా ఇప్పటివరకూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.కాకుంటే చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి లాంటి నేతలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇలాంటి నేతల్నికట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. అవసరం ఉన్నా.. లేకున్నా నిరసన చేస్తున్న నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. పోలీస్ స్టేషన్లకు తరలించటం కనిపించింది.

భావోద్వేగ అంశానికి సంబంధించిన బంద్ విషయంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా విపక్ష నేతలు వ్యవహరిస్తే కట్టడి చేయటంలో తప్పు లేదు. కానీ.. అలాంటిదేమీ లేకున్నా.. పోలీసుల హడావుడి చేయటం వల్ల అధికారపక్షంపై నెగిటివ్ మార్క్ పడుతుంది. న్యాయమైన అంశం మీద.. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే.. అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్న భావన ప్రజలకు కలిగితే.. హోదా విషయంలో అధికారపక్షం అంత కమిట్ మెంట్ తో పని చేయటం లేదనిపించటం ఖాయం. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం కనిపించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా నిరసన పేరుతో నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని మరింత శ్రమించటం.. రోడ్లు ఊడ్చటం లాంటివి ఆచరణలో సాధ్యం కానివి. ఒకవేళ.. నిజంగా అలా జరగాలంటే.. రాజకీయ పక్షాలన్నీ ఒక అఖిలపక్షంగా మారి.. హోదా విషయంలో కేంద్రానికి కళ్లు తెరిచేలా నిరసన చేపట్టాలని నిజాయితీతో అనుకొని.. పని చేస్తే బాబు చెప్పినట్లుగా సాధ్యమవుతుంది. ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపే అంశం పైననే ముఖ్యమంత్రి సుముఖంగా లేనప్పుడు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరనసలు చోటు చేసుకోవటం సాధ్యమయ్యే అంశం కాదని చెప్పొచ్చు.
Tags:    

Similar News