బాబు - పవన్ కలిసేలా చేస్తున్న వైసీపీ నేతలు

Update: 2022-10-17 04:07 GMT
మరే రంగంలో అయినా తొందరపాటుతో జరిగే నష్టంతో పోలిస్తే.. రాజకీయాల్లో ఆ డ్యామేజ్ భారీగా ఉంటుంది. చిన్న తప్పులకు సైతం భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని అత్యుత్సాహంతో వ్యవహరించే వైసీపీ నేతలకు అంత త్వరగా అర్థమయ్యే అవకాశం ఉండదనే చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఏదో అనుకుంటే మరేదో అయ్యేలాంటి పరిస్థితి నెలకొంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా.. వారిద్దరిని మాటలతో తరచూ టార్గెట్ చేసే వైసీపీ నేతల అత్యుత్సాహం రానున్న రోజుల్లో కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేయటం ఖాయమన్నట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ టార్గెట్ చేయటం.. ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడటంతో పాటు.. బాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ తపిస్తున్నారంటూ చేస్తున్న ప్రచారాలు టీడీపీ.. జనసేన మధ్య దూరం పెరుగుతుందన్న వ్యూహంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ తరహా మైండ్ గేమ్ కాస్తంత వర్కువుట్ అవుతున్నట్లు కనిపించినా.. ఆ డోస్ ను అంతకంతకూ పెంచేస్తున్న జగన్ బ్యాచ్ తీరుతో మొదటికే మోసం వచ్చేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ఎప్పుడైనా.. ఎవరినైనా టార్గెట్ చేయటం మొదలుపెడితే.. వ్యూహాత్మక నిర్ణయాలతో పైచేయి సాధించటం మామూలే. అలాంటి సందర్భాల్లోనే అత్యుత్సాహం మొదలవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఓకే. లేకుంటే తిప్పలే. ఇప్పుడు జగన్ బ్యాచ్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం టీడీపీ.. జనసేనలు రెండూ దగ్గరయ్యే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు.

బాబును సీఎం చేయటం కోసం పవన్ కష్టపడాలా? పవన్ కే సీఎం కుర్చీని ఇచ్చేందుకు బాబు రెఢీ కావాలన్న చర్చకు బదులుగా.. ముఖ్యమంత్రి ఎవరన్నది తర్వాత.. ఇద్దరు కలిసి ముందు జగన్ ను ఓడిస్తే తర్వాత విషయాలు తర్వాత ఉంటాయన్నంత వరకు విషయాలు వెళుతున్నాయని చెబుతున్నారు.

తాజాగా విశాఖలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ పై పోలీసులు తీరును తప్పు పడుతూ లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టుపెట్టి సానుకూలంగా స్పందించటమే కాదు.. జనసైనికులకు తమ మద్దతును తెలియజేశారు.

ఆదివారం సాయంత్రం అయ్యేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఫోన్లో మాట్లాడటమే కాదు.. పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు. మొత్తంగా చూస్తే.. ఇంతకాలం ఈ ఇద్దరు అధినేతలు మాట్లాడుకున్నది లేదు. జనసేనను పోలీసులు టార్గెట్ చేశారన్న ప్రచార వేళ.. విపక్ష అధినేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రెండు అడుగులు ముందుకు వేయటం ద్వారా కొత్త సమీకరణాలకు తెర తీశారని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News