జై అమ‌రావ‌తి : ఆర్ఆర్ఆర్ ఫుల్ హ్యాపీ..ఎందుకంటే ?

Update: 2022-03-03 14:30 GMT
అమ‌రావ‌తికి సంబంధించి కోర్టు తీర్పు వ‌చ్చాక వైసీసీ డీలా ప‌డిపోయిన నేప‌థ్యంలో మిగిలిన పార్టీలు ముఖ్యంగా ఆ రోజు గొంతు క‌లిపిన సంఘాలు అన్నీ ఇవాళ ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.వైసీపీ మాత్రం విప‌క్ష పార్టీల‌కు వ్య‌తిరేకంగా మ‌రో న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యేందుకు స‌న్నాహాలు చేస్తోంద‌ని తెలుస్తోంది.

దీనిని న్యాయ వ్య‌వ‌స్థ‌కూ, శాస‌న వ్య‌వ‌స్థ‌కూ మ‌ధ్య పోరుగా మార్చాల‌ని భావిస్తోంది.అస‌లు చ‌ట్టాలు చేసే అవ‌కాశం వాటిని ర‌ద్దు చేసే అవ‌కాశం చ‌ట్ట స‌భ‌ల‌కు కాక ఇంకెవ్వ‌రికి ఉంటుంద‌ని అలాంటిది సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు చేసే అధికారం శాస‌న‌స‌భ‌కు లేద‌ని చెప్ప‌డం భావ్యంగా లేద‌ని ఇప్ప‌టికే వివాదాస్ప‌ద ఉత్త‌రాంధ్ర మంత్రి బొత్స మీడియా ముఖంగా స్పందించి మాట్లాడి వెళ్లారు.

మ‌రోవైపు బాబు వ‌ర్గానికి ఇదొక తాత్కాలిక ఊర‌ట మాత్ర‌మేన‌ని తాము త్వ‌ర‌లోనే మ‌రో వెర్ష‌న్ లో 3 రాజ‌ధానుల బిల్లు తెస్తామ‌ని అంటోంది వైసీపీ.ఈ త‌రుణాన ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ స్పందించారు.

ఇప్పుడు ఊ అంటావా రెడ్డి ఊహూ అంటావా రెడ్డి అంటూ ఢిల్లీ కేంద్రంగా రెబ‌ల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ పాట‌లు పాడుతున్నారు.ఆ రోజు తాను అమ‌రావ‌తి రైతుకు అండ‌గా నిలిచాన‌ని,త‌న‌తో పాటు విప‌క్ష పార్టీలు కూడా మ‌ద్ద‌తుగా ఉండి న్యాయ పోరాటంలో భాగం అయ్యాయ‌ని గుర్తు చేసుకున్నారు.

ప‌వ‌న్ తో స‌హా ఇత‌ర పార్టీల‌న్నీ బాధిత రైతాంగాన్ని అంతా అర్థం చేసుకుని నాటి పోరాటానికి  అన్ని విధాలా అండ‌గా ఉన్నార‌న్నారు.ఇప్ప‌టికైనా అర్థం చేసుకుని సీఆర్డీఏ చ‌ట్టాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని కోరారు.

వాస్త‌వానికి అమ‌రావతి విష‌య‌మై మొద‌ట్నుంచి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ఆర్ఆర్ఆర్.ఆయ‌న త‌న‌దైన శైలిలో గొంతుక వినిపించ‌డమే కాదు క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వం బాధిత రైతుల గోడు వినిపించుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని వాపోయారు.

ఈ నేపథ్యంలో ఇవాళ హై కోర్టు తీర్పు వెలువ‌డిన సంద‌ర్భంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు ఎంతో సంతోషంగా ఉన్నారు.అమ‌రావ‌తిపై స్ప‌ష్టంఅయిన తీర్పు ఇస్తూ సీఆర్డీఏ చ‌ట్టం అనుసారం చెబుతూనే హై కోర్టు ఇవాళ కొన్నిమార్గ నిర్దేశ‌కాలు జారీ చేసింది.దీంతో పాటు రైతుల ప‌క్షాన నిలిచి కోర్టు కొన్ని సూచ‌ల‌ను చేసింది.

మొత్తం ఇదే విష‌య‌మై న‌మోదు అయిన 75 పిటిష‌న్ల‌కు సంబంధించి న్యాయ‌స్థానం తీర్పు చెప్పి రైతుల‌కు అండ‌గా నిలిచింది.దీంతో ఆర్ఆర్ఆర్ స్వీట్లు పంచారు.ఢిల్లీలో త‌న నివాసంలో పండ‌గ వాతావ‌ర‌ణం త‌ల‌పించేలా మీడియా మిత్రుల‌కు ఇంకా ఇత‌ర స‌న్నిహితుల‌కు కూడా స్వీట్లు పంచి త‌న ఆనందాల‌ను వెల్ల‌డించారు.
Tags:    

Similar News