కొత్త డీజీపీకి ఫస్ట్ లేఖ... ఎక్కడ నుంచంటే...?

Update: 2022-02-20 11:30 GMT
ఏపీకి కొత్త డీజీపీ వచ్చారు. ఆయన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి. ఆయన్ని ఏరీ కోరీ మరీ జగన్ సడెన్ గా తీసుకున్నారు. ఏకంగా పోలీస్ బాస్ ని చేసేశారు. ముప్పయ్యేళ్ల క్రితం ఆయన పోలీస్ శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

తాను శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని కొత్త డీజీపీ చెప్పేశారు.ఇక పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేసినా అది ఏకంగా పోలీస్ శాఖకే వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్త అని దిగువ స్థాయి అధికారులను సున్నితంగా హెచ్చరించారు. సమర్ధంగా  పనిచేయడమే తన విధానమని కూడా చెప్పేశారు.

ఇక కొత్త పోలీస్ బాస్ చార్జి తీసుకుని ఇరవై నాలుగు గంటలు కాలేదు కానీ ఆయనకు అపుడే లేఖలు మొదలైపోయాయి. ఫస్ట్ లేఖ ఎక్కడ నుంచి వచ్చింది అంటే వైసీపీ ఎంపీ నుంచే. ఆయన నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు.

ఆయన కొత్త డీజీపీకి ఒక కీలకమైన విషయం మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అప్పట్లో విచారణ పేరిట సీఐడీ పోలీసులు తన మీద దాడి చేశారని, ఆ కేసు మీద త్వరగా విచారణ జరిపించాలని కోరారు. అవసరం అయితే ప్రత్యేక బృందాన్ని కూడా నియమించాలని కూడా కోరారు. ఇక నాటి డీజీపీ గౌతం సవాంగ్ తన మీద సీఐడీ పోలీసులు జరిపిన దాడి ఘటన మీద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినా ఇవ్వలేదని ఆరోపించారు.

ఇక పోలీస్ వ్యవస్థ  మీద ప్రజలకు విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత పద్ధతిలో విచారణ ఉండాలని కూడా రాజు గారు సూచించారు. మొత్తానికి చూస్తే కొత్త డీజీపీకి మొదటి లేఖ ఘాటుగానే అందినట్లుగా ఉందని అంటున్నారు. చూడాలి మరి కొత్త బాస్ ఎలా రియాక్ట్ అవుతారో. ఆయన జోరూ తీరూ ఎలా ఉంటాయో.

ఇదిలా ఉండగా కొత్త డీజీపీ పనితీరు గురించి అపుడే చర్చ మొదలైంది. మాజీ డీజీపీది జగన్ మతమని యాగీ చేసిన వారు ఇపుడు ఏకంగా కొత్త డీజీపీ జగన్ కులమే కాదు, సొంత జిల్లా అని అపుడే అనేస్తున్నారు. అంటే కొత్త డీజీపీకి  విధి నిర్వహణ‌ ఎంత అగ్నిపరీక్ష అన్నది కూడా అర్ధం చేసుకోవాలి. ఆయన ముక్కుసూటిగా పనిచేసినా కూడా ఎక్కడో అక్కడ  అనుమానాలు ఉంటూనే ఉంటాయని చెప్పడానికే ఇలాంటి ప్రచారం అని కూడా ఒక వైపు సాగుతోంది.

ఇక డీజీపీ అంటే ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వంతో కలసి పనిచేయడం. ఆ విధంగా చూస్తే రానున్న కాలంలో ఎన్నికలు ఉంటాయి. ఒక డీజీపీని నియమిస్తే కనీసంగా రెండేళ్ల వరకూ ఆ పదవిలో కదపరాదు అని నిబంధనలు ఉన్నాయి. ఇక గౌతం సవాంగ్ అయితే ఏకంగా రెండేళ్ల తొమ్మిది నెలల పాటు పనిచేశారు. అయితే ఆయన్నే కంటిన్యూ చేస్తే ఎన్నికలకు ముందుగానే రిటైర్ అవుతారు అన్న ఆలోచనలు ఉండబట్టే కొత్త బాస్ ని తెచ్చారు అని అంటున్నారు.

అలా చూసుకుంటే 2024 ఎన్నికల వేళకు డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి ఉంటారని అంటున్నారు. ఒక విధంగా ఆయన ఎన్నికల డీజీపీ అని కూడా చెబుతున్నారు. మరి అధికారంలో వైసీపీ ఉంటూ జరిగే ఎన్నికలు అవి. విపక్షాలకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకూడదని కసిమీద జగన్ పోరాడే ఎన్నికలు అవి. అందుకే కొత్త పోలీస్ బాస్ ని ఎంపిక చేసి మరీ నియమించారని కూడా చర్చ సాగుతోంది.
Tags:    

Similar News