ర‌ఘురామ రాజీనామా లేనట్లేనా?

Update: 2022-03-28 17:30 GMT
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు రాజీనామా విష‌యంలో త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తున్నారు.  త‌న ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఆయ‌న ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున బ‌రిలో దిగే సూచ‌న‌లు మొన్న‌టివ‌ర‌కూ క‌నిపించాయి. కానీ ఇప్పుడు ఆయ‌న సైలెంట్ అయిపోయారు.

ఫిబ్ర‌వరి 5వ తేదీ త‌ర్వాత రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేదు. దీంతో ఆయ‌న త‌న ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్లు స‌న్నిహితులు చెబుతున్నారు. దాని వెన‌క బీజేపీ అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాల రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మేకులా త‌యార‌య్యారు.

వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఇన్ని రోజులుగా నానుతూ వ‌స్తున్న ఈ వ్య‌వ‌హారంలో త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది. అందుకే త‌న‌పై వేటు ప‌డే కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ర‌ఘురామ భావించారు. బీజేపీలో చేరి ఉప ఎన్నిక‌లో పోటీ చేసి తిరిగి విజ‌యం సాధించి వైసీపీకి స‌వాలు విస‌రాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

బీజేపీ అధిష్ఠానం నుంచి ర‌ఘురామ‌కు స్ప‌ష్టమైన హామీ దొర‌క‌లేద‌ని టాక్‌. పైగా ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో గెలిస్తే అది త‌మ‌పైనే ప్ర‌భావం చూపుతుంద‌నే భావ‌న‌తో బీజేపీ ఉంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు బీజేపీకి అవ‌స‌రం అనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు ర‌ఘురామ బీజేపీ నుంచి పోటీ చేసి వైసీపీని దెబ్బ‌కొడితే అప్పుడు ప‌రోక్షంగా బీజేపీపైనే దెబ్బ ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ నాయ‌కులు అనుకుంటున్నార‌ని టాక్‌.

మ‌రోవైపు ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు పిటిష‌న్ కూడా పెండింగ్‌లో ఉంది. ఇప్ప‌టికిప్పుడు దాని మీద స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు ఈ ఏడాది గుజ‌రాత్ ఎన్నిక‌లు ఉండ‌డంతో రాజీనామా వ‌ద్ద‌ని ఆయ‌న‌కు ఢిల్లీ పెద్ద‌లు సూచించార‌ని టాక్. 2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది.

దీంతో ఇప్పుడే రాజీనామా నిర్ణ‌యం మంచిది కాద‌ని బీజేపీ పెద్ద‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇక ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కొన్ని కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. న‌ర‌సాపురంను జిల్లా కేంద్రంగా చేయాల‌ని ర‌ఘురామ డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగేలా చూడాల‌న్న‌ది ప్ర‌స్తుతం ఆయ‌న కార్య‌చ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News