మాట నిల‌పుకున్నారు...వైసీపీ ఎంపీల రాజీనామా

Update: 2018-04-06 06:50 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్పార్ కాంగ్రెస్‌ కు చెందిన ఐదుగురు లోక్‌ స‌భ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్‌ ను క‌లిసి త‌మ రాజీనామాలు అంద‌జేయ‌నున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి - మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - అవినాశ్ రెడ్డి - వరప్రసాద రావు రాజీనామాలు చేసే వాళ్లలో ఉన్నారు.

పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కోరుతూ అదే పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాటానికి శ్రీ‌కారం చుట్టారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మార్చి5వ తేదీ నుంచి వైఎస్ ఆర్‌ సీపీ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఏకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. అయినా కేంద్రం చ‌ర్చ‌కు అనుమ‌తించకుండా పారిపోవ‌డంతో ఇవాళ వైఎస్ ఆర్‌ సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తిగా పార్టీ ఎంపీలు ప‌ద‌వులు త్యాజించేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ మేర‌కు త‌మ రాజీనామా ప‌త్రాల‌ను మ‌హానేత పాదాల వ‌ద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పించారు. అనంత‌రం ఏపీ భవన్‌ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. మ‌రోవైపు ఏపీ వేదిక‌గా వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు మ‌ద్ద‌తుగా దీక్షకు సంఘీభావ దీక్ష‌లు నిర్వ‌హించారు.
Tags:    

Similar News