వైసీపీ ఇపుడు కొత్త‌గా ముందుకు వ‌స్తోంది

Update: 2016-12-20 15:58 GMT
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు పెద్ద ఎత్తున్నే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్న తీరు ఇటీవ‌లి కాలంలో ప‌లు ప‌రిణామాలు గుర్తుచేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. వైసీపీకి పట్టున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓ ప్రముఖ హీరో బాబాయి - పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడికి చెందిన రెండెకరాల స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటు జగన్‌ నివాస గృహాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స‌మాచారం.

అయితే ఈ కొత్త కార్యాల‌యం నిర్మాణానికి సంవత్సరంపైగా పట్టే అవకాశాలు ఉండటంతో తాడేపల్లి సమీపంలోని ఒక క్లబ్‌ పక్కన ఉన్న ఓ ప్రైవేటు భవంతిని అద్దెకు తీసుకుని పార్టీ తాత్కాలిక కార్యాలయంగా తీర్చిదిద్దేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. అధికారంలోని తెలుగుదేశం పార్టీ గుంటూరు కేంద్రంగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పి కార్యాకలాపాలను నిర్వహిస్తుండడంతో ఇప్పటికే వెనుకబడి పోయామని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. రాజధాని భూ సమీకరణతో పాటు మచిలీపట్నం పోర్టు వ్యవహారం వంటి వాటిల్లో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలచుకోవాలంటే ప్రతిపక్ష నేత జగన్‌ స్వయంగా రంగంలోకి దిగాలని కొందరు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలపై వేగంగా స్పందించేందుకు - అవసరమైతే రాజకీయంగా ఎదురు దాడి చేసేందుకూ స్థానికంగా ఉంటేనే అనువుగా ఉంటుందని ప్రతిపక్ష నేతకు కొందరు సూచించినట్లు తెలుస్తోంది. జగన్‌ కూడా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి రాజధాని ప్రాంతానికి తరలివచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News