వైసీపీ స‌వాల్‌ తో బాబు ఇర‌కాటంలో ప‌డ్డ‌ట్లే

Update: 2017-12-12 05:58 GMT
ఢిల్లీ వేదిక‌గా ఏపీ రాజ‌కీయం మ‌రింత ర‌క్తి క‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో పెట్టే విధంగా కొత్త ఎజెండాను వైసీపీ సిద్ధం చేసిన‌ట్లు ఈ పార్టీ నేత‌లు చెప్తున్నారు. ఇందుకోసం పార్టీ అధినేత దిశానిర్దేశం చేశార‌ని అంటున్నారు. అనంతపురం జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి - మేకపాటి రాజమోనహరెడ్డి  -వై.వి. సుబ్బారెడ్డి - వరప్రసాద్ - మిథున్ రెడ్డి - అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాబోయే పార్ల‌మెంటు స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా గ‌ళం వినిపించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌త్యేకహోదా - పోలవరం ప్రాజెక్టు - రైల్వేజోన్ - విభజన హామీలతోపాటు రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై పార్లమెంటులో గళమెత్తాల‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌కు జ‌గ‌న్ స్పష్టం చేసిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పోరాడాల‌ని ఇందులో భాగంగా ప్ర‌త్యేక హోదాపై ఫోక‌స్ చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా ఏపీకి సంబంధించిన అంశాల‌పైనా త‌మ గ‌ళం వినిపించాల‌ని జ‌గ‌న్ త‌న ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.

పార్టీ అధినేత‌తో స‌మావేశం అనంత‌రం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదాపై ఇప్పటికే ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరగాలంటే - వైఎస్ ఆర్ సీపీ ఎంపిలు పార్లమెంటులో ఉండాలన్నారు. ఇందుకోసం తాము రాబోయే స‌మావేశాల్లో పోరాటం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రత్యేక హోదా వద్దంటూ - ప్యాకేజీ తీసుకున్న సంగతిని గుర్తు చేశారు. ఈ ప్యాకేజీ ప్రజలకా? చంద్రబాబుకా అని అడిగారు. రాష్ట్రానికి నిధులు రాకుండా తాము అడ్డుకుంటున్నామన్న టీడీపీ ప్రచారంపై ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని అన్నారు. ఉపాధి హామీ పేరుతో పేదల కొట్టి - టీడీపీ అడ్డగోలుగా దోచుకుంటుంటే - విచారణ చేయించాల‌ని కోరామన్నారు.

ప్రత్యేక హోదాపై పై రాజీనామాల అంశాన్ని పాత్రికేయులు ఎంపీల వద్ద‌ ప్రస్తావించగా - రాజీనామాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని - తమ రాజీనామలతో  ప్రత్యేక హోదా వస్తే ఇప్పుడే స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. రాజీనామాల అంశాన్ని స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు పెద్దది చేసి చూపిస్తున్నారని విమర్శించారు.  వైఎస్ ఆర్సీపీ నుంచి  9 మంది ఎంపీలు ఎన్నికయ్యారని - ఏపీ నుంచి ముగ్గురు - తెలంగాణ నుంచి ఒకరు పార్టీ ఫిరాయించారని వారిచేత కూడా రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. తాము రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రస్తావనకే రాదని... క‌నీసం ప్రత్యేక హోదాపై గొంతు వినిపించే వారు కూడా ఉండరన్నారు. పార్ల‌మెంటులో విభజన చట్టంలోని అన్ని అంశాలను సాధించే దిశ‌గా త‌మ గ‌ళం కొనసాగుతుంద‌ని వైసీపీ ఎంపీలు పున‌రుద్ఘాటించారు.
Tags:    

Similar News