టీడీపీ పని అయిపోయిందా.. వైసీపీ వర్సెస్.. బీజేపీసేన... ముక్కోణపు పోరు ఖాయం...?

Update: 2022-11-18 04:43 GMT
వారం రోజుల క్రితం విశాఖ వచ్చిన నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుని భేటీ వేశారు. ఈ సందర్భంగా చర్చలు జరిపారు. సుమారు అరగంటకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల సారాంశం ఏమిటి అన్నది ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఇది వన్ టూ వన్ గా సాగిన సమావేశం. దాంతో ఆ వివరాల మీద ఎవరికి తోచినట్లుగా వారు వార్తలు రాసుకున్నారు, విశ్లేషించుకున్నారు.

అయితే లేటెస్ట్ గా ఆ గుట్టుని విప్పారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆయన చెప్పినది ఏంటి అంటే తెలుగుదేశంతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని మా ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్‌కి తెలియచెశారని చెప్పుకొచ్చారు. అంతే కాదు, వంశపారంపర్య రాజకీయ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, అలాంటి పార్టీల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని,  అదే విషయాన్ని పవన్‌కు తెలియజేశామని ఆయన ఒక ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇపుడు సంచలనం రేపుతోంది.

అంటే మోడీ కుండబద్ధలు కొట్టినట్లుగా తెలుగుదేశంతో అసలు పొత్తులు ఉండవని పవన్ కి చెప్పేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి అనుగుణంగా ఆ తరువాత విజయనగరం టూర్ లో పవన్ సైతం తమకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరడం కూడా బలపరుస్తోంది. దీనిని బట్టి చూస్తే కనుక ఏపీలో టీడీపీ నుంచి జనసేనను విజయవంతంగా ఢిల్లీ పెద్దలు విడగొట్టారనే అంటున్నారు.

ఆలా కనుక ఆలోచిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన ఒక కూటమిగా, అలాగే టీడీపీ, వైసీపీ వేరుగా చేస్తే ముక్కోణపు పోటీ ఉంటుందని, ఇదే ఖాయమని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే 2024 ఎన్నికల ముందైనా టీడీపీ బీజేపీ కలుస్తాయన్న ఊహాగానాలకు చెక్ పడినట్లు అవుతుతోంది.

మరి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం పవన్ కి ఇష్టం లేదు అనే అంటున్నారు. ఈ విషయంలో పవన్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా చేస్తారా అలా కనుక చేస్తే ఏపీలో టీడీపీని అధికారానికి దూరంగా ఉంచవచ్చు. కానీ బీజేపీ జనసేన కూటమి పవర్ లోకి రాదు, అదే టైం లో మరో సారి వైసీపీకి చాన్స్ ఉంటుంది. మరి పవన్ దీనిని ఎంతవరకూ అంగీకరిస్తారు అన్న సందేహాలు అయితే ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సోము వీర్రాజు మాటలను బట్టి చూస్తే టీడీపీని దూరం పెట్టడం ఖాయమనే భావన వ్యక్తం అవుతోంది.

మరో వైపు చూస్తే చంద్రబాబు లాస్ట్ చాన్స్ అన్న మాటలను కూడా సోము వీర్రాజు తనదైన శైలిలో విమర్శించారు. లాస్ట్ చాన్స్ ఆయనకా లేక ఆయన పార్టీకా అన్న చర్చ కూడా సాగుతోందని సెటైర్లు వేశారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ బీజేపీ జనసేనల మధ్యనే పోటీ ఉంటుందని సోము తేల్చేశారు. ఆయన మాటలను చూస్తే తమ కూటమికి పవర్ ఖాయమనే ధీమా కూడా ఉన్నట్లు తోస్తోంది. మరి ఆయన చెప్పినట్లుగా టీడీపీ పని అయిపోయిందా ఏమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News