'అమెరికా అండర్ 19 జట్టు'..తెలుగమ్మాయే కెప్టెన్..అందరూ భారతీయులే

గుజరాత్ కు రంజీలాండిన మోనాక్ పటేల్ ఏకంగా అమెరికా కెప్టెన్ కావడం విశేషం.

Update: 2024-12-23 11:30 GMT

క్రికెట్లో అమెరికా.. కాదు.. కాదు.. ‘క్రికెట్లో భారతీయ అమెరికన్ జట్టు’ అనాలేమో..? ఎందుకంటే.. మొన్నటికి మొన్న ఆరు నెలల కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ లో అమెరికా జట్టులో సగంమంది పైగా భారతీయ మూలాలున్నవారే. ఇప్పటికే భారత్ అండర్-19 ప్రపంచ కప్ (2012) విజేత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఉన్ముక్త్ చంద్, న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరె అండర్సన్ వంటి వారు అమెరికా జాతీయ జట్టుకు ఆడుతున్నారు. గుజరాత్ కు రంజీలాండిన మోనాక్ పటేల్ ఏకంగా అమెరికా కెప్టెన్ కావడం విశేషం.


కుర్రాళ్లలోనూ..

అమెరికా జాతీయ జట్టులోనే కాదు.. కుర్రాళ్ల జట్టులోనూ అత్యధికులు భారతీయ సంతతి వారే. గత 2 దశాబ్దాల్లో భారత్ నుంచి వలస వెళ్లి అగ్రరాజ్యంలో స్థిరపడినవారికి పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు.. అక్కడి జాతీయ జట్లకు ఆడుతున్నారు. తాజాగా

అమెరికా అండర్ 19 మహిళల జట్టును పరిశీలిస్తే అందరూ భారతీయులే లేదా భారతీయ మూలాలున్నవారే.

మనమ్మాయే కెప్టెన్

అమెరికా అండర్ 19 మహిళల జట్టు కెప్టెన్ గా నియమితురాలైంది కొలాన్ అనికా రెడ్డి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేసియాలో ఈ ప్రపంచ కప్ జరగనుంది. ఇక ఇదే జట్టులోని వారంతా భారతీయులే. వారి పేర్లను చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది.

మొత్తం 15 మందీ భారతీయులే

అమెరికా అండర్ జట్టు కెప్టెన్ అనికారెడ్డి కాగా, వైస్ కెప్టెన్ అదితిబా చూడసమా వ్యవహరించనున్నారు. పగిడ్యాల చేతనారెడ్డి, చేతన జి.ప్రసాద్, దిశా దింగ్రా, ఇసానీ మహేష్ వాఘేలా, లేఖా హనుమంత్ శెట్టి, మాహీ మాధవన్, నిఖార్ పింకూ దోషీ, పూజా గణేష్, పూజా షా, రితూ ప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, శాషా వల్లభనేని, సుహానీ తదానీ.

కొసమెరుపు: నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ లుగా ఎంపికైన మిథాలీ పట్వర్థన్, తరుణమ్ చోప్రా, వర్షిత జంబూలా కూడా భారతీయ మూలాలున్నవారే.

Tags:    

Similar News