హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఆ కెప్టెన్సీ నుంచి కూడా ఔట్

హార్దిక్ కు సూర్య కారణంగా టీమ్ ఇండియా కెప్టెన్సీనే కాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కూడా దక్కకుండా పోతోంది అనుకోవాలి.

Update: 2024-08-15 20:30 GMT

పరిస్థితులు చూస్తుంటే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం అనుకూలంగా లేనట్లుంది. సోదరుడు అని పెట్టుబడి పెడితే ఒకడు రూ.3.5 కోట్లకు మోసం చేశాడు.. సరే గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ అందించాడని..ముంబై ఇండియన్స్ కు తీసుకొస్తే.. జట్టు జట్టంతా దారుణ ప్రదర్శన చేసింది. ఎన్నడూ లేనంతగా ఓటములు ఎదుర్కొంది. ఆ సయమంలో హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మతోనూ గొడవ పడినట్లు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు వ్యక్తిగతంగానూ లీగ్ లో దారుణ ప్రదర్శన చేశాడు. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మతో సరిగా ప్రవర్తించకపోవడంతో నెటిజన్ల ట్రోలింగ్, మైదానంలో అభిమానుల హేళనకు గురయ్యాడు. అయితే, టి20 ప్రపంచ కప్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించి.. మ్యాచ్ లలో రాణించి.. మరీ ముఖ్యంగా ఫైనల్లో చివరి ఓవర్ ను సమర్థంగా వేసి చాంపియన్ జట్టులో భాగమయ్యాడు. తద్వారా కొంత నష్టాన్ని పూరించుకున్నాడు.

లంక టూర్ కు ముందు షాక్ ప్రపంచ చాంపియన్ జట్టులో సభ్యుడైన ఆనందం హార్దిక్ కు ఎక్కువ రోజులు నిలవలేదు. మధ్యలో వ్యక్తిగతంగానూ నష్టమే జరిగింది. భార్య నటాషాతో విడిపోయాడు. ఆమె కుమారుడిని తీసుకుని స్వదేశం వెళ్లిపోయింది. ఇంతలో.. శ్రీలంకలో జరిగిన టూర్ లో టి20 సిరీస్ కు హార్దిక్ ను కాకుండా సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనివెనుక ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. అతడు హార్దిక్ కంటే సూర్యనే ఎక్కువగా నమ్మాడు. దీంతో టి20 ఫార్మాట్ కు భారత కెప్టెన్ అవుతాడనుకున్న హార్దిక్ ఆశలు కల్లలయ్యాయి. కనీసం అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. తనకంటే యువకుడైన శుభ్ మన్ గిల్ వైపు మొగ్గుచూపారు.

ఉన్నది పోయేలా..

హార్దిక్ కు వచ్చే ఐపీఎల్ సీజన్ చాలా కీలకం. అయితే, అతడిని కెప్టెన్ గా కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్ ఇష్టపడడం లేదని సమాచారం. హార్దిక్ కంటే సూర్యనే నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, హార్దిక్ కు ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. తరచూ గాయపడే తీరుతో రిస్క్ తీసుకోవద్దని ముంబై యాజమాన్యం భావిస్తున్నదని చెబుతున్నారు. ఐపీఎల్- 2025 మెగా వేలం డిసెంబరులో ఉంది. దీనిపై బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఎక్కువమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రాంచైజీలు కోరుతున్నాయి. ముంబై 7 నుంచి 8 మందికి అవకాశం ఇవ్వాలని అడుగుతోంది. వీరిలో హార్దిక్ ఉన్నాడో లేదో చూడాలి. కాగా.. కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తిగా ఉన్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ రిటెన్షన్‌ కు ఒప్పుకోవడం లేదట. వీరిని తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ విధంగా సూర్యను కెప్టెన్ చేస్తే సరిపోతుందని అనుకుంటోందట. దీంతో హార్దిక్ ఎసరొచ్చింది.

అక్కడ ఇక్కడా సూర్యనే..

హార్దిక్ కు సూర్య కారణంగా టీమ్ ఇండియా కెప్టెన్సీనే కాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కూడా దక్కకుండా పోతోంది అనుకోవాలి. ఫిట్‌ నెస్ సమస్యలను చూపి.. హార్దిక్‌ ను బీసీసీఐ పక్కకు తప్పించినట్లు.. ముంబై కూడా చేయనుందని తెలుస్తోంది. ఆలాగైతే హార్దిక్‌ కు డబుల్ షాక్.. సూర్యకు డబుల్ ప్రమోషన్ అనుకోవాలి.

Tags:    

Similar News