హైదరాబాద్-బెంగళూరుతో 'వరుణుడి' మ్యాచ్.. ప్లే ఆఫ్స్ చేరడం ఎలా?
చెన్నైతో గెలిచినా ఇతర జట్ల ఫలితాల ఆధారంగానే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.
ఐపీఎల్ సీజన్ -17 లీగ్ దశ ముగింపులో ఉత్కంఠభరిత సమీకరణాలు.. ఓ వైపు మూడు జట్లు నాకౌట్ కోసం ప్రయత్నిస్తుంటే వాటిని నాకౌట్ చేసేందుకు వరుణుడు నేనున్నానంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో వీధులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరద పోటెత్తుతోంది. ఉప్పల్ మైదానం ఉన్న ఉప్పల్ ప్రాంతాన్ని కూడా వరుణుడు ముంచెత్తుతున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ తో ఉప్పల్ లో హైదరాబా మ్యాచ్ పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. వర్షం తీవ్రతను బట్టి చూస్తే ఇప్పటికైతే మ్యాచ్ జరగడం దాదాపు అసాధ్యమే. వాన వెలిసినా గ్రౌండ్ అందుబాటులోకి రాదని చెప్పవచ్చు. కాగా, మ్యాచ్ జరిగి గుజరాత్ ను హైదరాబాద్ ఓడిస్తే ప్లేఆఫ్స్ నకు వెళ్తుంది. ఢిల్లీ, లఖ్ నవూ ఇంటిముఖం పడతాయి. మరో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం చెన్నై - బెంగళూరు పోటీపడతాయి. కాగా, బెంగళూరు 13 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చెన్నైతో గెలిచినా ఇతర జట్ల ఫలితాల ఆధారంగానే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ, అటు బెంగళూరులోనూ వర్షం ముప్పుంది. అక్కడ కూడా మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ ఇంటికే.
హైదరాబాద్ కు మేలా? కీడా?
ఉప్పల్ మ్యాచ్ రద్దయి హైదరాబాద్, గుజరాత్ లకు చెరో పాయింట్ లభిస్తే.. సన్ రైజర్స్ (15 పాయింట్లతో) ప్లే ఆఫ్స్ నకు వెళ్తుంది. పంజాబ్ తో ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్- 2లోకి రావొచ్చు. అప్పుడు రాజస్థాన్ తన చివరి మ్యాచ్ లో కోల్‌కతా మీద ఓడిపోవాలి. గుజరాత్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి వస్తుంది. బెంగళూరులో బెంగళూరుతో మ్యాచ్ రద్దయితే చెన్నై (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. మ్యాచ్ జరిగి చెన్నైపై భారీ తేడాతో బెంగళూరు నెగ్గితే ప్లేఆఫ్స్ కు వెళ్లే వీలుంది.
సొంత మైదానంలో గుజరాత్ ను కొట్టేస్తే హైదరాబాద్ నేరుగా నాకౌట్ కు వెళ్తుంది. హైదరాబాద్ చివరి రెండు మ్యాచుల్లోనూ ఓడి.. ఆఖరి మ్యాచ్ లో చెన్నైపై స్వల్ప తేడాతోనైనా బెంగళూరు గెలిస్తే మాత్రం సన్‌రైజర్స్ కు చుక్కెదురైనట్లే. అప్పుడు సీఎస్కే, ఆర్సీబీ అనూహ్యంగా నాకౌట్ దశకు వెళ్లిపోతాయి.