ధోనీకి మరీ రూ.4 కోట్లేనా? దీని వెనుక కారణమేంటి..?
అది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకోవడం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా వెలువడింది. ఇందులో చాలావరకు ఊహించినట్లుగానే రిటెన్షన్ ఉన్నాయి. అయితే, ఒకే ఒక్క పాయింట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకోవడం. మొదటి సీజన్ నుంచే ఐపీఎల్ కు ఊపు తెచ్చినవారిలో ధోనీ ఒకడు. ఆపై చెన్నై సూపర్ కింగ్స్ కు ఏకంగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు టైటిల్ సాధించిపెట్టాడు. మరో ఆరుసార్లు (పుణె సూపర్ జెయింట్స్ సహా) ఫైనల్ కు చేర్చాడు.
చెన్నై పునాదే అతడు
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ధోనీనే. అలాంటి ధోనీని చెన్నై అతడు ఆడినంత కాలం కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ధోనీకి ఇప్పటికే 43 ఏళ్లు. ఫిట్ నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. గత ఏడాది ఐపీఎల్ అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇక వచ్చే సీజన్ కు ధోనీని రిటైన్ చేసుకోవడంపై ఎవరికీ అనుమానాలు లేవు. అయితే, అతడికి ఇచ్చిన ధరను చూస్తేనే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
తొలి సీజన్ కంటే తక్కువ ధరకే..
ఈ నెల మూడో వారంలో జరిగే మెగా వేలానికి ముందుగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు రూ.18 కోట్లు, శ్రీలంక పేసర్ మతీశ పతిరనకు రూ.13 కోట్లు, ఆల్ రౌండర్ శివం దూబేకు రూ.12 కోట్లు ఇచ్చింది. కానీ, ధోనీకి రూ.4 కోట్లతో సరిపెట్టింది. ఇది తొలి సీజన్ 2008 నాటి కంటే తక్కువ ధర. దీంతో ఇదేంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ధోనీ అన్ క్యాప్డ్ ప్లేయర్. ఆ కారణంగానే చాలా తక్కువ మొత్తానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురికి రూ.55 కోట్లు ఖర్చుపెట్టిన చెన్నై రూ.65 కోట్లతో మెగా వేలంలోకి అడుగుపెట్టనుంది.
ఐదేళ్ల నిబంధనతో..
టీమ్ ఇండియాకు గత ఐదేళ్లలో ప్రాతినిధ్యం వహించని క్రికెటర్ ను, సెంట్రల్ కాంట్రాక్టులో లేని వారినీ అన్ క్యాప్డ్ కేటగిరీగా పరిగణిస్తారు. ఇలాంటివారిని రూ.4 కోటక్లే దక్కించుకునే చాన్సుంది. ఆ అవకాశాన్ని చెన్నై ఉపయోగించుకుంది. ధోనీ 2019 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అంటే.. సరిగ్గా ఈ ఏడాది ఆగస్టు 15కు ఐదేళ్లు పూర్తయ్యాయి. దీంతోనే అన్ క్యాప్డ్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు.