0..7..11.. 150.. 2000.. ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంట్రస్టింగ్ పాయింట్స్
ఈ క్రమంలో 36 ఇన్నింగ్స్ లోనే 2 వేల పరుగుల మైలురాయిని చేరాడు. వీటిని కేవలం 2,300 బంతుల్లోనే సాధించాడు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్ ల సీజన్ నడుస్తోంది. సందడి సందడిగా సాగుతోంది. ఒకవైపు డర్బన్ లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక టెస్టు మ్యాచ్ ఆడుతోంది.. క్రైస్ చర్చలో న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ తలపడుతోంది.. కొద్ది రోజుల ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం జరిగింది.. నిన్ననే పాకిస్థాన్-జింబాబ్వే వన్డే సిరీస్ ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని అరుదైన, ఆసక్తికరమైన గణాంకాలు నమోదయ్యాయి. అవేంటో చూద్దామా?
2300 బంతుల్లో 2000 పరుగులు
ప్రస్తుత తరం క్రికెటర్లలో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ అన్ని ఫార్మాట్లలో విధ్వంసకారుడు. రెండేళ్ల కిందట ఇతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ధరకు కొనుక్కుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఇతడు సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో 36 ఇన్నింగ్స్ లోనే 2 వేల పరుగుల మైలురాయిని చేరాడు. వీటిని కేవలం 2,300 బంతుల్లోనే సాధించాడు. స్ట్రయిక్ రేట్ 86.96 కాగా.. 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇతడి కంటే ముందే ఇంగ్లండ్ కే చెందిన బెన్ డకెట్ 2,293 బంతుల్లో 2 వేల పరుగులు చేశాడు.
వేలంలో అమ్ముడవని ఆటగాళ్లతో ఐపీఎల్ టీమ్
గత ఆది, సోమవారాల్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో కొందరు మంచి ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. వీరిలో ఒకప్పుడు ఐపీఎల్ లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా టీమ్ ఇండియా టెస్టు బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఇలా అమ్ముడుపోని 11 మందితో ఐపీఎల్ జట్టును రూపొందిస్తే.. 1) వార్నర్ (కెప్టెన్), 2) ప్రథ్వీషా, 3) మయాంక్ అగర్వాల్, 4) బెయిర్ స్టో, 5) డారిల్ మిచెల్, 6) సర్ఫరాజ్ ఖాన్, 7) సికిందర్ రజా, 8) శార్దూల్ ఠాకూర్, 9) పీయూష్ చావ్లా, 10) ఉమేశ్ యాదవ్, 11) ముస్తాఫిజుర్ రెహ్మాన్.
7 ఓవర్ల లోపే 7 వికెట్లు
ప్రపంచ క్రికెట్ లో 6 అడుగులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ యాన్సెన్ 6.7 అడుగుల ఎత్తుతో ఎవరికీ అందనంత ‘ఎత్తులో’ నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో ఇతడు తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టాడు. అది కూడా 7 ఓవర్లో లోపే (6.5 ఓవర్లలో) కావడం గమనార్హం. 120 ఏళ్ల కిందట 1904లో ఆస్ట్రేలియా బౌలర్ హ్యూయ్ ట్రంబుల్ ఇంగ్లండ్ పై 6. 5 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత యాన్సెన్ కే రికార్డు దక్కింది.
150వ టెస్టులో అరుదైన డక్
ఇంగ్లండ్ టెస్టు బ్యాట్స్ మన్ జో రూట్ ఇటీవలి కాలంలో మాంచి జోరు మీద ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ టెస్టు పరుగుల రికార్డు (15,921) దిశగా దూసుకెళ్తున్నాడు. 149 టెస్టుల్లో 12,754 పరుగులు చేశాడు రూట్. 150వ టెస్టు న్యూజిలాండ్ తో ఆడుతున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో అతడు డకౌట్ అయ్యాడు. 150 టెస్టులు ఆడడం అంటే అది అరుదైన రికార్డే. 10 మంది క్రికెటర్లకు మాత్రమే ఇది సాధ్యమైంది. అయితే, 150వ టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా (2002లో పాకిస్థాన్ పై), రికీ పాంటింగ్ (2010లో ఇంగ్లండ్ పై)లు డకౌట్ అయ్యారు.