హార్దిక్ పాండ్యాపై అనుమానం.. మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ఇదే సమయంలో ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంపైనా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యా చ్ టాస్ సమయంలో రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కాయిన్ తిప్పి తీసినట్టుగా ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంపైనా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి!
ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇందులో భాగంగా... రోహిత్ శర్మపై కెప్టెన్ గా వేటుకు పాండ్యానే కారణమంటూ ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. పైగా... వరల్డ్ క్లాస్ పేసర్ బుమ్రాను కాదని, తొలి మ్యాచ్ లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా విమర్శలకు కారణమైంది.
అయితే... ఇంతలోనే ఏమైందో ఏమో కానీ... తర్వాత హార్దిక్ పాండ్యా తన పంథా మార్చుకున్నాడు! ఇందులో భాగంగా... బౌలింగ్ కంటే బ్యాటింగ్ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు అందుకుని విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. అయితే హార్దిక్ బౌలింగ్ చేయకపోవడానికి మరో కారణం ఉండి ఉండొచ్చనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సైమన్ డౌల్!
అవును... ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... హార్దిక్ పాండ్యా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయకపోవడాన్ని ప్రస్తావించిన సైమన్ డౌల్.. "తొలి మ్యాచ్ లో తొలి ఓవర్ ను వేసిన బౌలర్.. అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గాయపడినట్లున్నాడు" అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో... "హార్దిక్ ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు.. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడని నా మనసు బలంగా చెబుతోంది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!!