బజ్ బాల్ భయపడేలా.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో భారత్ బాదుడు

బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ జట్టు ఇంతలా చెలరేగిపోయింది.

Update: 2024-09-30 16:30 GMT

కేవలం 34.4 ఓవర్లు.. 285 పరుగులు.. రన్ రేట్ 8.22.. ఇదేదో వన్డే మ్యాచ్ కాదు.. టి20 అంతకన్నా కాదు.. ఓ టెస్టు మ్యాచ్.. 50.. 100.. 150.. 200 ఇలా స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉంది.. ఇవన్నీ రికార్డు బంతుల్లో వచ్చినవే.. 3 ఓవర్లలోనే 50.. 10.1 ఓవర్లలోనే 100.. 18.2 ఓవర్లలోనే 150.. 24.2 ఓవర్లలోనే 200.. ఇదీ మన బ్యాట్స్ మెన్ జోరు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ జట్టు ఇంతలా చెలరేగిపోయింది.

రికార్డులు బద్దలు..

ఐదారేళ్ల నుంచి ఇంగ్లండ్ జట్టు బజ్ బాల్ అంటూ టెస్టులను వన్డేలు మాదిరిగా ఆడుతోంది. బజ్ బాల్ అంటే మరేమిటో కాదు.. సంప్రదాయ టెస్టుల్లోనూ దూకుడుగా ఆడడం. అయితే.. ఇప్పుడా బజ్ బాల్ కూడా భయపడేలా మన జట్టు రికార్డులు కొల్లగొట్టింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ లో మరెవరికీ సాధ్యం కాని ఘనతలివి కావడం గమనార్హం. బంగ్లాదేశ్ ను సోమవారం 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. ఆపై బ్యాటింగ్ లో ఆసాంతం దూకుడు చూపింది. బంగ్లా బ్యాట్స్ మన్ మోమినుల్ హక్ సెంచరీ సాధించాడు. చివరగా 2017లో హైదరాబాద్ లో ముష్ఫికర్ రహీమ్ సెంచరీ చేశాడు.

ఓపెనర్ల దంచుడు..

ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ సిక్స్ లతో విరుచుకుపడితే.. యువ యశస్వి జైశ్వాల్ బౌండరీలతో దుమ్మురేపాడు. 18 బంతుల్లోనే 50+ పరుగులు జోడించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో అత్యంత ఫాస్టెస్ట్ గా 50 పరుగుల మార్క్ ను అందుకున్న జోడీగా నిలిచారు. ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్ - బెన్‌ స్టోక్స్‌ 26 బంతుల్లో 50+ స్కోరు రాబట్టిన రికార్డును తుడిచిపెట్టారు. రోహిత్ (23: 11 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్) ఔటైనప్పటికీ యశస్వి బౌండరీలతో చెలరేగాడు. 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున పంత్ (28 బంతుల్లో), కపిల్ (30 బంతుల్లో), శార్దూల్ (31 బంతుల్లో) తర్వాత అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన నాలుగో బ్యాటర్‌ గా నిలిచాడు. కేవలం 10.1 ఓవర్లలోనే భారత్‌ వంద పరుగుల మార్క్‌ చేరింది. గత ఏడాది వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో వంద పరుగులు చేయగా.,. ఇప్పుడు దానిని అధిగమించింది.

ఎలాగైనా టెస్టు గెలవాలని..

రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన రీత్యా.. టీమ్ ఇండియా ఎలాగైనా బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ గెలవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే చకచకా పరుగులు చేసింది. క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్ మన్ బాదుడే లక్ష్యంగా కనిపించారు. భారత్ 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. వారిని ఎంత తక్కువకు ఆలౌట్ చేస్తే అంత తక్కువ లక్ష్యం భారత్ ముందు ఉంటుంది. మంగళవారం టెస్టుకు చివరి రోజు. ఇందులో విజయం సాధిస్తే భారత్ కు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగే 8 టెస్టుల్లో నాలుగు గెలిచినా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరే చాన్స్ ఉంటుంది. ఈ టెస్టు డ్రా అయితే.. వచ్చే 8 టెస్టుల్లో ఐదు గెలవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News