టీ20 వరల్డ్ కప్: ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ కు.. కప్పు సొంతం చేసుకోవాలంతే!

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై టీమిండియా జట్టు 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

Update: 2024-06-28 04:28 GMT

టీ20 ప్రపంచకప్ 2024 చివరకు వచ్చేసింది. రెండో సమీస్ లో టీమిండియా జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ టీం మీద ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. 2022 సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై.. ఫైనల్ కు అవకాశాన్ని కోల్పోయిన దానికి బదులుగా ఈసారి సెమీస్ లో ఇంగ్లండ్ జట్టును ఇంటికి పంపి.. సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది టీమిండియా జట్టు. దీంతో ఖాతా సమమైంది.

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై టీమిండియా జట్టు 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో జూన్ 29న (శనివారం) జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రియా జట్టుతో తలపడనుంది. పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో టీమిండియా జట్టు ఫైనల్ చేరుకుంది. 2014లో టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ కు చేరితే.. దశాబ్దం తర్వాత కానీ ఫైనల్ కు చేరే అవకాశం దక్కలేదు.

రెండేళ్ల క్రితం (2022) టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు 169 పరుగల లక్ష్యాన్ని ఇస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించటం ద్వారా రోహిత్ సేనకు ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. కట్ చేస్తే.. ఈసారి మళ్లీ అదే ప్రపంచకప్ లో అదే జట్టుతో సెమీస్ లో భారత్ తనకు ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఈసారి ఇంగ్లండ్ విజయలక్ష్యంగా 172 పరుగులు ఇచ్చింది.

Read more!

ఈ స్కోర్ ను అలవోకగా ఛేదిస్తామని భావించిన బట్లర్ సేనకు భారత బౌలింగ్ టీం చుక్కులు చూపించింది. కేవలం 103 పరుగులకు అలౌట్ చేయటం ద్వారా.. రెండేళ్ల క్రితం ఓటమికి ఘనమైన ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లైంది. టీమిండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేయటం ద్వారా గౌరవప్రదమైన స్కొర్ సాధ్యమైంది.

అయితే.. బౌలింగ్ లో స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్.. అక్షర్ పటేల్ చెలరేగిపోవటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు తోక ముడిచే పరిస్థితి. 19 పరుగులు ఇచ్చిన కుల్ దీప్ మూడు వికెట్లు.. 23 పరుగులు ఇచ్చి మరో మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ పుణ్యమా అని ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం నడుము విరిచేశారు. లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ లో కెప్టెన్ బట్లర్ చెలరేగి ఆడారు. కాకుంటే అది మూడు ఓవర్లకే పరిమితం చేశారు భారత బౌలర్లు. మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన ఇంగ్లండ్ పతనం నాలుగో ఓవర్ నుంచి మొదలైంది.

అక్షర పటేల్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించిన బట్లర్.. వికెట్ కీపర్ పంత్ కు దొరికిపోవటంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తర్వాతి ఓవర్లో బుమ్రా సాల్ట్ ను ఐట్ చేయగా.. ఆ తర్వాత స్పిన్నర్ల ద్వజం తమ మేజిక్ తో వచ్చిన బ్యాటర్లను వచ్చినట్లుగా పెవిలియన్ కు పంపేశారు. చెలరేగిపోయి వికెట్లు తీస్తున్న అక్షర్ దీప్ కు కుల్ దీప్ తోడు కావటంతో వికెట్ మీద వికెట్ అన్నట్లుగా మారింది. దీంతో.. 16.4 ఓవర్లకే ఇంగ్లండ్ జట్టు అలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్.. ఆర్చర్ లు కాస్తపాటి స్కోర్లు చేయకుంటే ఆ జట్టు స్కోర్ వంద పరుగులు కూడా దాటేది కాదు. ఈ మ్యాచ్ లో భారత్ కు ఒక హైలెట్ లాంటి విశేషం .. మరో డిజప్పాయింట్ మెంట్ ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ గా 5 వేల పరుగుల మైలురాయిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. అతనికంటే ముందు కోహ్లి 12,883 పరుగులు..ధోని 11,207 పరుగులు.. అజహరుద్దీన్ 8095 పరుగులు గంగూలీ 7643 పరుగులతో ముందున్నారు. ఇక.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో అస్సలు రాణించట్లేదు. అతడి ఆటతీరుతో అందరిని నిరాశకు గురి చేస్తున్న పరిస్థితి. గ్రూప్ దశలో జరిగిన మూడు మ్యాచ్ ల్లో ఐదు పరుగులే చేసిన విరాట్.. తాజా మ్యాచ్ లో తొమ్మిది బంతులకు తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. ఒక సిక్స్ తో అలరించి.. అందరిలో ఆశలు కల్పించిన కోహ్లీ.. ఆ తర్వాతి ఓవర్ కే వికెట్ సమర్పించుకొవటం ద్వారా అభిమానులకు మరోసారి నిరాశను కల్పించారు.

Tags:    

Similar News