యూట్యూబర్ చేతిలో ఓటమి.. మైక్ టైసన్ ఎమోషనల్ కామెంట్స్!
తనకంటే చాలా చిన్నవాడైన జేక్ పాల్ చేతిలో ఓడిపోవడంపై మైక్ టైసన్ స్పందించారు.
కెవిన్ చేతిలో 2005లో ఓటమి తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్ కి గుడ్ బై చెప్పిన బాక్సింగ్ దిగ్గజం, స్టార్ బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా ఇటీవల రింగ్ లోకి దిగిన సంగతి తెలిసిందే. సుమారు 20 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి దిగిన ఆయన.. 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో ఓటమి పాలయారు. ఈ మ్యాచ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో మొదటి రెండు రౌండ్లలోనూ మునుపటి మైక్ టైసన్ కనిపించిగా.. తర్వాత ఆరు రౌండ్లలోనూ ఆ ఉత్సాహం కంటిన్యూ చేయలేకపోయారు 58 ఏళ్ల దిగ్గజ బాక్సర్. ఫలితంగా ఓటమిపాలయ్యారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఓటమి అనంతరం స్పందించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తనకంటే చాలా చిన్నవాడైన జేక్ పాల్ చేతిలో ఓడిపోవడంపై మైక్ టైసన్ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేతిలో ఓడిపోయినందుకు తనకు ఏమాత్రం బాధ లేదని అన్నారు. మ్యాచ్ అనంతరం "ఎక్స్"లో స్పందించిన ఆయన.. ఓటమిలో కూడా విజయాన్ని చూసుకునే సందర్భం ఇదని చెబుతూ.. గత రాత్రికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన టైసన్... ఈ ఏడాది జూన్ లో మరణం అంచుల వరకూ వెళ్లొచ్చినట్లు తెలిపారు. సుమారు 12 కిలోల బరువు, సగానికిపైగా రక్తాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో 8 సార్లు రక్తమార్పిడి చేశారని.. ఆ పరిస్థితుల్లో హెల్తీగా మారి ఫైట్ చేయడంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో... తన కంటే వయసులో సగం ఉన్న ఓ ప్రతిభావంతుడైన యువకుడితో.. డల్లాస్ లోని కిక్కిరిసిన కౌబాయ్ స్టేడియం.. మునివేళ్లపై కదులుతూ తాను చేసిన 8 రౌండ్ల పోరాటాన్ని తన పిల్లలు చూశారని పేర్కొన్నారు మైక్ టైసన్. మరోవైపు జేక్ పాల్ స్పందిస్తూ... రికార్డులు బద్దలయ్యాయని చెబుతు.. "లవ్ యూ మైక్" అని పోస్ట్ చేశారు.
కాగా ఏటీ & టీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను సుమారు 72,300 మంది ప్రత్యక్షంగా వీక్షించగా.. దాదాపు ఆరు కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. ఈ సమయంలో వ్యూవర్స్ తాకిడికి నెట్ ఫ్లిక్స్ లో చాలా సేపు షట్ డౌన్ అయినట్లు వార్తలొచ్చాయి.