ఒక్క ఏడాది నలుగురు కెప్టెన్లు.. అదే ఆ దేశ క్రికెట్ టీమ్ ప్రత్యేకత

అయితే, షాహీన్ న్యూజిలాండ్ పర్యటనతో తేలిపోయాడు. దీంతో టెస్టులకు అతడిని కాదని షాన్ మసూద్ ను కెప్టెన్ ను చేశారు.

Update: 2024-10-19 12:30 GMT

వన్డే ప్రపంచ కప్ లో ఓడిపోతే ఓ కెప్టెన్ రాజీనామా.. విదేశాల్లో టి20 సిరీస్ ఓడిపోతే మరో కెప్టెన్ రాజీనామా.. టి20 ప్రపంచ కప్ కు మళ్లీ పాత కెప్టెన్ కు పగ్గాలు.. అందులోనూ ఘోర పరాజయంతో కెప్టెన్సీ వద్దంటూ రాజీనామా.. ఇక టెస్టుల్లో మరో కొత్త కెప్టెన్.. అతడు అసలు బ్యాట్స్ మన్ గానే పనికిరాడు.. దీంతో సొంతగడ్డపై వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి.. ఇప్పుడు అతడినీ తప్పించి మరొకరికి కెప్టెన్సీ. ఇదంతా ఒక్క ఏడాదిలోనే..

జీతాల్లేవ్ కానీ.. కెప్టెన్లు మారుతున్నారు

పాకిస్థాన్ క్రికెట్ అంటేనే పెద్ద అనిశ్చితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతిభ ఉన్నప్పటికీ అత్యంత అధ్వాన ఆటతీరు దాని సొంతం. వన్డే ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్ చేతిలో, టి20 ప్రపంచ కప్ లో అమెరికా చేతిలో ఓడిన చరిత్ర దానిది. అలాంటి పాకిస్థాన్ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవట. వీరిలో స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది వంటివారున్నారు. కానీ, ఏడాదిలో ఇప్పుడు ఆ జట్టుకు నాలుగో కెప్టెన్ రానున్నాడట.

అప్పుడే అతడికి ఇచ్చి ఉంటే..?

పాకిస్థాన్ జట్టులో అత్యంత నిలకడైన బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ తనదైన కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి రిజ్వాన్ కు ఇప్పటివరకు కెప్టెన్సీ దక్కలేదు. ఓ దశలో బాబర్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలతో జట్టును గెలిపించిన రికార్డు రిజ్వాన్ ది. కానీ, అతడిని కాదని పేసర్ షాహీన్ షా ఆఫ్రిదిని టీమ్ మేనేజ్ మెంట్ కెప్టెన్ ను చేసింది. అయితే, షాహీన్ న్యూజిలాండ్ పర్యటనతో తేలిపోయాడు. దీంతో టెస్టులకు అతడిని కాదని షాన్ మసూద్ ను కెప్టెన్ ను చేశారు. షాన్ సాధారణ బ్యాట్స్ మన్. తుది జట్టులో చోటే కష్టమైనవాడు. అలాంటివాడికి ఏకంగా కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం.

చివరకు రిజ్వాన్ కే ఓటు కెప్టెన్లుగా అందరి ప్రతిభను చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు రిజ్వాన్ ను కెప్టెన్ చేయనుందట. ఏడాది కిందటే వన్డే ప్రపంచ కప్ లో పరాజయం అనంతరం బాబర్ రాజీనామా చేశాడు. అతడి స్థానంలో రిజ్వాన్ ను కెప్టెన్ చేసి ఉంటే అయిపోయేది. కానీ, పనికిరాని ప్రయోగాలు చేసింది. వాస్తవానికి కెప్టెన్సీ ఇవ్వనందుకు రిజ్వాన్ కొంత మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ ప్రభావం అతడిపై బ్యాటింగ్ పై పడింది. అయితే, ఎట్టకేలకు పాకిస్థాన్ బోర్డు రిజ్వాన్ ను సారథిని చేసి తప్పు దిద్దకుంది. ఈ నెలాఖరులో అతడికి కెప్టెన్సీ ఇచ్చి చూడనుంది.

Tags:    

Similar News