రేపే చివరి టెస్టు..రోహిత్ ఔట్ ? కొత్త కెప్టెన్లతో భారత్, ఆస్ట్రేలియా
హిట్ మ్యాన్ ను శుక్రవారం నుంచి జరగనున్న ఐదో, చివరి టెస్టుకు తుది జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ప్రస్థానం ముగిసిందా? హిట్ మ్యాన్ ను ఇక కేవలం వన్డేల్లో మాత్రమే.. (అదీ సెలక్టర్లు ఎంపిక చేస్తే) చూడగలమా..? ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు తర్వాత జట్టుతో చేరిన రోహిత్ చివరి టెస్టు ఆడకుండానే కెరీర్ ముగించనున్నాడా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. హిట్ మ్యాన్ ను శుక్రవారం నుంచి జరగనున్న ఐదో, చివరి టెస్టుకు తుది జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
ఇటు బుమ్రా..
టీమ్ ఇండియాను ఐదో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుమ్రా తొలి టెస్టులో సారథ్యం వహించి గెలిపించాడు. ఈ సిరీస్ లో అద్భుత ఫామ్ లో ఉన్నాడు. నాలుగు మ్యాచ్ లలో 30 వికెట్లు తీశాడు. దీంతో రోహిత్ శర్మను తప్పించి బుమ్రాకు ఐదో టెస్టు కెప్టెన్సీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ స్లిప్ లో క్యాచ్ ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు బుమ్రాతోనే కోచ్ గంభీర్ చర్చించడం గమనార్హం. వీటన్నిటి రీత్యా బుమ్రానే శుక్రవారం నుంచి జరిగే టెస్టులో టీమ్ ఇండియా నడిపించేదని తెలుస్తోంది. అంతేకాక.. వికెట్ ను నిర్లక్ష్యంగా పారేసుకుంటున్న, పెద్దగా ఫామ్ లో లోని వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ ను తీసుకోనున్నట్లు చెబుతున్నారు. రోహిత్ స్థానంలో శుబ్ మన్ గిల్ వస్తాడని భావిస్తున్నారు. నడుము నొప్పితో తప్పుకొన్న పేసర్ ఆకాశ్ దీప్ బదులుగా హర్షిత్ రాణాను ఆడించనున్నారు.
అటు స్టీవ్ స్మిత్..
భారత్ తో ఐదో టెస్టులో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేయనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మరోసారి తండ్రి కానుండడంతో సెలవు తీసుకున్నాడు. దీంతో స్మిత్ కు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి 2014-18 మధ్య స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని కెప్టెన్సీ కోల్పోయాడు. ఏడాది పాటు జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు స్మిత్ ఈ సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలు చేసి ఫామ్ లోకి వచ్చాడు. బాక్సింగ్ డే టెస్టులో 140 పరుగుల అతడి ఇన్నింగ్స్ జట్టును నిలిపింది.