దంచుడాఫ్రికా.. మొదట 428.. మొన్న 311.. నిన్న 399.. నేడు 382

ఆస్ట్రేలియాపై 311, శ్రీలంకపై 428.. ఇంగ్లండ్ పై 399.. బంగ్లాదేశ్ పై 382.. ఇవీ ఆ జట్టు స్కోర్లు. మిగతా జట్లు కనీసం 300 చేయడానికే ఇబ్బంది పడుతుండగా.. సఫారీలు మాత్రం 400 కొట్టేస్తున్నారు.

Update: 2023-10-25 04:01 GMT

ఆ జట్టు బ్యాడ్ లక్ కు మారు పేరు.. ఒత్తిడికి చిత్తవడంలో మొదటి వరుసలో ఉంటుంది.. ఏదో ఒక ఊహించని అవాంతరంతో ఐసీసీ టోర్నీల్లో కప్ కొట్టడంలో విఫలమవుతుంది.. చూసేవాళ్లు కూడా అయ్యో అనేలా ఉంటుంది ఓడిపోతుంది.. అంతమాత్రాన ప్రతిభకు లోటు లేదు.. బ్యాటింగ్ లో పవర్.. బౌలింగ్ లో వేగం.. ఫీల్డింగ్ లో మెరిక.. కానీ, ఎక్కడో బ్యాడ్ లక్ వెంటాడుతుంటుంది. అత్యంత బలంగా కనిపించే అలాంటి జట్టు ప్రపంచ కప్ లు ఆడినా, టైటిల్ గెలుస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈసారి కూడా అలానే బరిలోకి దిగింది. కానీ, ఓ మ్యాచ్ లో దానికి అంతర్గత శత్రువైన ఒత్తిడి వెంటాడింది. కానీ, మొత్తమ్మీద చూస్తే మాత్రం దుమ్ము దులుపుతోంది. అదికూడా అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

300 కు తగ్గడం లే..

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా చెలరేగుతోంది. ఆస్ట్రేలియాపై 311, శ్రీలంకపై 428.. ఇంగ్లండ్ పై 399.. బంగ్లాదేశ్ పై 382.. ఇవీ ఆ జట్టు స్కోర్లు. మిగతా జట్లు కనీసం 300 చేయడానికే ఇబ్బంది పడుతుండగా.. సఫారీలు మాత్రం 400 కొట్టేస్తున్నారు. అందులోనూ ఆ జట్టు బ్యాట్స్ మెన్ మామూలుగా ఆడడం లేదు. ఓపెనర్ డికాక్ అయితే ఇప్పటికే మూడు సెంచరీలు బాదేశాడు. మార్క్ రమ్, క్లాసెన్ చెరో సెంచరీ సాధించారు. సెంచరీల కంటే వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్న తీరు అద్భుతం అని చెప్పాలి. హెన్రిచ్ డసెన్ కూడా ఒక శతకం చేశాడు. హెండ్రిక్స్ చక్కగా ఆడుతున్నాడు. వీరంతా తలోచేయి వేస్తూ ఉండడంతో 300 పైనే స్కోర్లు కొట్టేస్తోంది దక్షిణాఫ్రికా.

ఒకరు కాకుంటే మరొకరు

ఈ టోర్నీలో 400 పైగా పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్. అయితే, విచిత్రం ఏమంటే ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసిన మ్యాచ్ లో డికాక్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. కానీ, క్లాసెన్ మెరుపు సెంచరీ, హెండ్రిక్స్, డసెన్, జాన్సన్ అర్ధసెంచరీలు, మార్క్ రమ్ (42) కీలక ఇన్నింగ్స్ తో సఫారీలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో జాన్సన్ 42 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్ హైలైట్. ఇలా ఎవరికి వారు చెలరేగుతుండడంతో దక్షిణాఫ్రికా గెలుపు సులువవుతోంది.

బౌలింగ్ లో కాదు.. బ్యాటింగే బలం

మొదట్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ బలంగా ఉండేది. బ్యాటింగ్ లో ఆమ్లా, కలిస్, డివిలియర్స్, డుప్లెసిస్, బౌలింగ్ లో రబడ, స్టెయిన్ తదితరులతో భీకరంగా కనిపించేది. అయితే, ఇప్పుడు బౌలింగ్ లో కాస్త వెనుకబడింది. రబడ ఉన్నప్పటికీ.. రెండో పేసర్ గా పెద్దగా అనుభవం లేని ఎంగిడి, జాన్సన్ లను నమ్ముకుంటోంది. కొయిట్జ్ వంటివారు పూర్తిగా కొత్త. భారత సంతతి ఆటగాడు కేశవ్ మహరాజ్ స్పిన్ బౌలింగ్ పెద్ద దిక్కు. అయితే, రబడ, ఎంగిడి, జాన్సన్ తమ పాత్రలకు న్యాయం చేస్తుండడంతో సఫారీలు దూసుకెళ్తున్నారు.

భారత్ బహుపరాక్

దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ను సునాయాసంగా ఓడించింది. ఇక మిగిలిన పెద్ద జట్లలో దానికి ఎదురయ్యేవి న్యూజిలాండ్, భారత్. ఇప్పుడు సఫారీల దూకుడు చూస్తుంటే టీమిండియా బహుపరాక్ అనాల్సిందే. నవంబరు 5న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీనికంటే ముందుగా నవంబరు 1న దక్షిణాఫ్రికా –న్యూజిలాండ్ ఢీకొంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ గనుక దక్షిణాఫ్రికాను ఓడిస్తే మానసికంగా టీమిండియాకు అది కాస్త పైచేయి. లేదూ.. న్యూజిలాండ్ ను కూడా దక్షిణాఫ్రికా చిత్తు చేస్తే గనుక రోహిత్ శర్మ సేనకు పెద్ద సవాలే.

కొసమెరుపు

ఈ ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా దూకుడుకు అడ్డే లేదా...? అంటే ఎందుకు లేదు అని చెప్పాలి. ఆ జట్టుకు ఒత్తిడే అంతర్గత శత్రువు. దీనికి ఉదాహరణ.. నెదర్లాండ్స్ తో మ్యాచ్ దీనికి ఉదాహరణ. 43 ఓవర్లలో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది ఆ జట్టు. ఇక్కడో ఇంకో విషయం కూడా వివరించాలి. దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తేనే భీకరంగా ఆడుతోంది. ఛేజింగ్ కు దిగిన ఒకే ఒకసారి (నెదర్లాండ్స్ పై) మాత్రం చేతులెత్తేసింది. దీన్నబట్టి చెప్పేదేమంటే.. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిస్తే ఏ జట్టయినా మొదట బ్యాటింగే ఎంచుకోవాలి.

Tags:    

Similar News