సన్ రైజర్స్ రిటెన్షన్ లిస్ట్ ఇదే.. తెలుగోడు సహా అందులో ఎవరెవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కు వేలం నవంబరులో జరగనుంది. ఇక ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కు వేలం నవంబరులో జరగనుంది. ఇక ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి..? అసలు వచ్చే సీజన్ రూల్స్ ఏమిటి..? అనే తదితర ప్రశ్నలకు ఇప్పటికే జవాబు దొరికింది. నిరుడు మినీ వేలంలోనూ రికార్డు స్థాయి ధరలు పలకగా.. ఈసారి మెగా వేలం ఇంకెలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. కాగా, ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ మేనేజ్ మెంట్ ఆమోదం తెలిపింది. అయితే, ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కూడా ఉంది. ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది..? అనే ఉత్కంఠకు త్వరలో తెరపడనుంది.
ముందుగా మన సన్ రైజర్సే..
ఐపీఎల్ టైటిల్ ను రెండుసార్లు (దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్) సాధించింది హైదరాబాద్ ఫ్రాంచైజీ. నిరుడు దుమ్మరేపే దూకుడైన ఆటతో రికార్డు స్కోర్లు నమోదు చేసింది. వాస్తవానికి ఆ ఊపు చూస్తే సన్ రైజర్స్ టైటిల్ కొట్టేస్తుందని భావించారు. అలాగే ఫైనల్ కూ చేరింది కూడా. కానీ, చెన్నై పిచ్ చిదంబర రహస్యాన్ని కనిపెట్టలేక బోల్తా కొట్టింది. తొలుత బ్యాటింగ్ కు దిగి దూకుడుగా ఆడబోయిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మన హైదరాబాద్ రన్నరప్ తో సరిపెట్టుకుంది.
అతడికే 23 కోట్లు..
వచ్చే సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్షిణాఫ్రికాకు చెందిన పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ.23 కోట్లు పెట్టనుందని సమాచారం. అయితే, గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్, పేసర్ ప్యాట్ కమిన్స్ ను మాత్రం రూ.18 కోట్లకే రిటైన్ చేసుకుంటుందట. కాగా, 2024 సీజన్ లో సంచలన ప్రదర్శన చేసి టీమ్ ఇండియా కూడా ఎంపికై అక్కడా సెంచరీ కొట్టిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంటుందట. ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్, విశాఖపట్నం ఆల్ రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డినీ వదులుకోవడానికి సన్ రైజర్స్ సిద్ధంగా లేదని సమాచారం.
ఢిల్లీ ముగ్గరేనా?
ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురినే అట్టిపెట్టుకుందని తెలుస్తోంది. వీరిలో కెప్టెన్ రిషబ్ పంత్ ను రూ.18 కోట్లకు, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను రూ.14 కోట్లకు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను రూ.11 కోట్లకు తీసుకుంటుందట. రిటైన్ చేసుకునే ప్లేయర్లకు రూ.75 కోట్ల వరకు ఖర్చుపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో గత సీజన్ లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్, దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. వీరి రేంజ్ రూ.75 కోట్ల బడ్జెట్ లో ఉంటే రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ద్వారా పొందాలనేది ఢిల్లీ ఆలోచనగా చెబుతన్నారు. కాగా, ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవాలనుకున్న ఆటగాళ్ల పేర్లను ఈ నెల 31 వరకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. మరో రెండు వారాలే సమయం.