రోహిత్, కోహ్లి.. బీసీసీఐ తిరస్కరణకు గురైన ఆ క్రికెటర్ ఎవరు?
అంతర్జాతీయ పర్యటనలకు కుటుంబ సభ్యులను క్రమంతప్పకుండా తీసుకెళ్లే సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.
ఈ సంవత్సరంలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ. మరొక్క ఐదు రోజుల్లో ఈ టోర్నీ మొదలుకానుంది. ఇలాంటి సమయంలో టీమ్ ఇండియాకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటగాళ్లకు బీసీసీఐ విధించిన టెన్ కమాండ్ మెంట్స్ తర్వాత జరుగుతున్న మొదటి టోర్నీ ఇదే కావడంతో కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది.
టెన్ కమాండ్ మెంట్స్ ప్రకారం.. ఆటగాళ్లు ఖాళీ సమయంలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి. మరొక ప్రధాన నిబంధన ఏమంటే.. విదేశీ టూర్ల సందర్భంగా ఫ్యామిలీని అనుమతించడం. అయితే, విదేశీ టూర్లు 40 రోజులకు మించితే భార్యా, పిల్లలను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది. కానీ, చాంపియన్స్ ట్రోఫీ 3 వారాలే జరగనుంది.
నిబంధనల ప్రకారం దుబాయ్ లో జరుగుతన్న చాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్ల ఫ్యామిలీలను అనుమతించే అవకాశం లేదు. అయితే, తనను మినహాయించాలని ఓ సీనియర్ ఆటగాడు బిసిసిఐని అడిగాడు. కానీ దీనికి బీసీసీఐ నిరాకరించినట్లు సమాచారం.
అంతర్జాతీయ పర్యటనలకు కుటుంబ సభ్యులను క్రమంతప్పకుండా తీసుకెళ్లే సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. కోహ్లి భార్య అనుష్కశర్మ, రోహిత్ భార్య రితికా సజ్దేహ్ తరచూ స్టేడియంలలో కనిపిస్తారు. ఫ్యామిలీలకు అనుమతి నేపథ్యంలో బీసీసీఐ నిరాకరణ నేపథ్యంలో ఆ సీనియర్ ఆటగాడు ఎవరా? అనే చర్చ జరుగుతోంది.
ఆ సీనియర్ ఆటగాడు తమ స్టార్ డమ్, బోర్డును ప్రభావితం చేసే ఉద్దేశంతో కుటుంబాలను తీసుకెళ్లేందుకు అనుమతి అడిగి ఉంటారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.