సోషల్ మీడియా.. ఓ విద్వేష ప్రదేశం.. రోహిత్, కోహ్లినీ వదలదు
కోహ్లి ఇంకా ఆడడం ఎందుకు? తొలి టెస్టులో సెంచరీ కొట్టినా తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన సంగతి మరువొద్దు.
''అబ్బా.. రోహిత్ శర్మ మళ్లీ ఎందుకొస్తున్నాడు..? అతడు లేకుండానే ఆస్ట్రేలియాలో తొలి టెస్టు గెలిచాం కదా..? యువకులు, కొత్త టాలెంటెడ్ కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు కదా..? వారికి అవకాశం ఇచ్చేందుకు రోహిత్ తప్పుకొంటే బెటర్''
''కోహ్లి ఇంకా ఆడడం ఎందుకు? తొలి టెస్టులో సెంచరీ కొట్టినా తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన సంగతి మరువొద్దు. అతడి సెంచీ బాగా ఆలస్యమైంది. పెద్ద మ్యాచ్ లలో అతడి ఆట ఏమీ బాగోలేదు''.
..ఇదీ టీమ్ ఇండియా స్టార్లు, 15 ఏళ్లుగా బ్యాటింగ్ మూల స్తంభాలుగా నిలిచిన రోహిత్, కోహ్లిలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల తీరు. అన్నీ విద్వేషంతో కూడినవే. టీమ్ ఇండియాకు వారు చేసిన సేవలను, ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించిన రోజులను మర్చిపోయి చేస్తున్న విమర్శలే.
ఔను వయసైంది..
వాస్తవంగా చెప్పాలంటే కోహ్లి 36, రోహిత్ 37 ఏళ్ల వయసులోనూ ఫర్వాలేదనే స్థాయిలో ఆడుతున్నారు. ఇటీవలి న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లోనే వీరు విఫలమయ్యారు. ఆ సిరీస్ ఒక బ్యాడ్ మూమెంట్. దానినే పట్టుకుని రోహిత్, కోహ్లిలపై ద్వేషం పెంచుకున్నారు కొందరు.
రిటైర్మెంట్ వారికి తెలియదా?
దాదాపు 17 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లిలను మరీ ఇంతగా హేళన చేయడం సోషల్ మీడియా యాక్టివిస్టులకు తగదు. వారి ఆటతీరు పై విమర్శలు చేయొచ్చు కానీ.. ఎప్పుడు రిటైర్ అవుతారు? అంటూ హేళనగా మాట్లాడడం వారి సేవలను తక్కువ చేయడమే అవుతుంది. వారి అద్భుత కెరీర్ ను అవమానించడమే. కానీ, ద్వేషం తప్ప ఇదేమీ తలకెక్కని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లిలను విమర్శిస్తూ పోస్టు పెడుతున్నారు.
మరి రాణిస్తే..
పెర్త్ లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ పై కోహ్లి సెంచరీ కొట్టాడు. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు బ్యాటింగ్ కోసం అతడు సుదీర్ఘంగా నిరీక్షించాడు. రాహుల్, యశస్వి ఎంతకూ ఔట్ కాకపోవడంతో ప్యాడ్ లతో మైదానంలోకి వచ్చి వారిని అభినందించి, ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఇక రోహిత్ తనకు కుమారుడు పుట్టిన ఆనందాన్ని మధ్యలోనే వదిలేసి మరీ జట్టుతో కలుస్తున్నాడు. ఇలా చేయకున్నా వీరిద్దరి స్థానాలకు వచ్చిన ముప్పేమీ లేదు. కానీ, వారి అంకితభావం మాత్రం వారిని ఊరికే ఉండనివ్వదు కదా..? సోషల్ మీడియా విద్వేషకారులకు మాత్రం ఇవేమీ గుర్తుండవు.
గౌరవంగా సాగనంపాలి..
ఎవరు ఔనన్నా, కాదన్నా.. రోహిత్, కోహ్లి కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికారు. రెండేళ్లలో వారు అన్ని ఫార్మాట్లకూ బైబై చెబుతారు. అలాంటి దిగ్గజాలను గౌరవంగా సాగనంపాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపించేసినా ఆ ఇద్దరి స్థానాలను పూర్తిగా భర్తీచేయగలగడం కుర్రాళ్లకు కష్టమే. ఈ రెండేళ్లలో వారి మార్గదర్శకత్వంలో తర్వాతి తరాన్ని తయారు చేసుకోవాలి. ఎంతైనా అనుభవం అనుభవమే. అందుకనే.. రోహిత్, కోహ్లిలకు గౌరవప్రద వీడ్కోలు పలకడం అభిమానుల బాధ్యత. ..అది సోషల్ మీడియాలో కూడా.