పేట పై ఎడతెగని పంచాయతీ.. వైసీపీలో అంతర్మథనం..!
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు స్థానంపై వైసీపీలో ఎడతెగని పంచాయతీ సాగుతోందనే టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు స్థానంపై వైసీపీలో ఎడతెగని పంచాయతీ సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నుంచిలావు శ్రీకృష్ణ దేవరాయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బలమైన నాయకుడు రాయపాటి సాంబశివరావుపై ఆయన విజయం దక్కించుకున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ టకెట్‌ను తనకు ఇవ్వాలని ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాల శౌరి పదే పదే కోరుతున్నారు. గతంలో ఇక్కడ తాను పోటీ చేశానని.. కూడా చెబుతున్నారు.
దీనికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. మాజీమంత్రి పేర్నినానికి, బాలశౌరికి మధ్య ఏమాత్రం పడడం లేదు. అదే సమయంలో మంత్రి జోగి రమేష్ దూకుడు ఎక్కువగా ఉండడంతో ఎంపీతో సంబంధం లేనట్టే ఆయన వ్యవహరించడంతోపాటు.. సొంత కార్యక్రమాలు కూడా చేస్తుండడం ఎంపీకి ఆవేదనగా ఉంది. దీంతో తాను ఎంత చేసినా.. పార్టీ నేతలు గుర్తించడం లేదని.. మచిలీపట్నం అభివృద్ధిలో తన పాత్ర ఎంతో ఉందని బాలశౌరి చెబుతున్నారు.
స్థానిక నాయకులు.. తనకు బలంగా లేని చోట ఉండలేనన్నది బాలశౌరి వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో నే వచ్చే ఎన్నికల్లో తనకు పేటను ఇవ్వాలని ఆయన కొన్నాళ్లుగా కోరుతున్నారు. ఇక, పేట ఎంపీగా ఉన్న లావుకు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా మార్పు కోరుకుంటున్నారు. తనకు గుంటూరు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, గుంటూరు నుంచి పోటీకి మరోసారి తన అదృష్టం చూసుకునేందుకు మోదుగుల వేణు గోపాల్‌రెడ్డి రెడీ అవుతున్నారు.
తాజాగా ఆయన అమరావతిలో సీఎం జగన్‌ను అత్యంత రహస్యంగా కలిసి.. తన బలాబలాలపై... నివేదిక ఇచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. పేట వరకు మార్పు చేసినా.. లావు ను ఎక్కడ నుంచి రంగంలోకి దింపాలనేది ఇప్పుడు చర్చగా మారింది.
మరోవైపు.. ఆయన పార్టీ మారుతున్నారనే చర్చ వైసీపీలో జరుగుతున్నా.. అలాంటిదేమీ లేదని ఎంపీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా లావు అలా చేయడనే అంటున్నాయి. మొత్తానికి పేట నియోజకవర్గంపై మాత్రం ఏమీ తేలడం లేదని.. త్వరలోనే నిర్ణయం ఉంటుందని అంటున్నారు.