ఆరు సార్లు గెలిచినా ఆశలన్నీ ఆవిరేనా ?
ఇక తండ్రి మరణానంతరం ధూళిపాళ్ళ నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయన ఒక్కసారి కాదు ఆరు సార్లు గెలిచారు. అందులోనూ అయిదు సార్లు అయితే ఏకధాటిగా గెలిచారు. ఆయనే ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ఆయన తండ్రి కూడా కరడు కట్టిన టీడీపీ నాయకుడు. ఇక తండ్రి మరణానంతరం ధూళిపాళ్ళ నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు.
ఆయన 1994లో తొలిసారి పొన్నూరు నుంచి గెలిచారు. ఆ తరువాత వరసగా 1999, 2004, 2009, 20014లలో కూడా గెలిచారు. ఇక 2019లో ఆయన తొలిసారి ఓటమి చవిచూశారు. 2024లో మళ్లీ అంతే ఉత్సాహంతో గెలిచారు. ఇదిలా ఉంటే ధూళిపాళ్ళ నరేంద్ర ఆరు సార్లు ఎమ్మెల్యే అయితే టీడీపీ మూడు సార్లు అధికారంలో కూడా ఉంది. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.
కానీ ఉమ్మడి ఏపీలో కానీ విభజిత ఏపీలో కానీ నరేంద్రకు మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. పార్టీకి ఆయన వీర విధేయుడుగా పేరు గడించారు. అధినాయకత్వం మాట జవదాటరు. అంతే కాదు పార్టీ కోసం పనిచేయడంలో ముందుటారు
అంతవరకూ ఎందుకు 2019 నుంచి 2024 మధ్యలో ఆయన వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసి కేసులు కూడా పెట్టించుకున్నారు.జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఈ విధంగా పార్టీకి పెద్ద దిక్కుగా బలమైన వాయిస్ గా ఉనన్ నరేంద్రకు 2024లో అయినా తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు.
మరో వైపు చూస్తే నరేంద్ర ఎవరి జోలికీ వెళ్ళే రకం కాదు, తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఆయన మీద ఏ రకమైన ఆరోపణలూ లేవు, అవినీతి మరక కూడా అంటలేదు. మరి అలాంటి నాయకుడికి మంత్రి పదవిని ఎందుకు ఇవ్వడం లేదు అన్నదే చర్చగా ఉంది.
గతంలో అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కోడెల శివప్రసాద్ వంటి సీనియర్ నాయకులు ఉండడంతో కుదరలేదు. ఇపుడు చూస్తే మిత్రపక్షం అయిన జనసేన షాక్ ఆయనకు తగిలింది అని అంటున్నారు. అదెలా అంటే తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ కి మంత్రి పదవిని పొత్తు ధర్మంలో ఇవ్వాల్సి వచ్చింది.
దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన నరేంద్రకు మంత్రి పదవి దక్కలేదు అని అంటున్నారు. పోనీ చీఫ్ విప్ పదవి అయినా ఇస్తారని భావిస్తే జీవీ ఆంజనేయులుకు ఇచ్చేశారు. దాంతో నరేంద్ర వర్గీయులు నిరాశ చెందుతున్నారు.తమ నేతకు మంత్రి యోగం లేదా అని వారు వాపోతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక రాజకీయాలకు విరామం ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆయనకు ఈ దఫాలోనే మంత్రి పదవిని ఇవ్వాలి. ఇక విస్తరణలో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుంది అన్న ఆశ అయితే ఉందిట. లేకపోతె మాత్రం ఇంతటి సీనియర్ నేతకు నిరాశ నీడలా కమ్ముకుందని భావించాల్సిందే అని అంటున్నారు.