ఇద్దరి స్కెచ్ రూ.200 కోట్లు హాంఫట్!
ఇది చిన్నా చితకా మోసం కాదు. బరితెగించిన ఇద్దరు వేలాది మందిని ముంచేశారు. కేవలం ఏడాది వ్యవధిలో రూ.200 కోట్లు కొల్లగొట్టారు.
ఇది చిన్నా చితకా మోసం కాదు. బరితెగించిన ఇద్దరు వేలాది మందిని ముంచేశారు. కేవలం ఏడాది వ్యవధిలో రూ.200 కోట్లు కొల్లగొట్టారు. సోషల్ మీడియా మోసాలకు మించిన ఈ నయా వంచనకు గుంటూరు నగరం కేంద్రమైంది. థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) అన్న పేరుతో వేల మందికి అధిక లాభాలు ఆశచూపి నిండాముంచేసిన ఇద్దరు ముదుర్ల భాగోతమిది.
గుంటూరు నగరానికి చెందిన వేజండ్ల శివకుమారి, నల్లపాడుకు చెందిన నవీన్ అనే వ్యక్తి కలిసి టీపీఎఫ్ కంపెనీ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరిపై బాధితులు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు కలిసి టీపీఎఫ్ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రజలకు వల విసిరారు. వీరి వలలో తొలిగా చిక్కిన పెదనందిపాడు గ్రామస్థులు గోవాడ సంధ్య శివపార్వతి, షేక్ హుస్సేన్ వలి నిండా మోసపోయారు. తొలుత క్రిప్టో కరెన్సీ తరహాలో కీబో కాయిన్స్ బిజినెస్ చేసిన సంధ్య శివపార్వతి, హుస్సేన్ వలికి శివకుమారి పరిచయమైంది.
తనకు తెలిసిన టీపీఎఫ్ కంపెనీలో రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేల చొప్పున తిరిగి చెల్లిస్తారని, ఇందులో సగం మీరు తీసుకుని మిగిలిన సగం కంపెనీకి తిరిగి చెల్లించాలని చెప్పారు. టీపీఎఫ్ కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెసపాన్సిబిలిటీ ఫండ్ కింద కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2% సమకూరుస్తాయని ఆ డబ్బును కంపెనీ మనకు చెల్లిస్తుందని తెలిపింది. దీనికి దక్షిణ భారత్ హెడ్ అంటూ నల్లపాడుకు చెందిన నవీన్ ను పరిచయం చేసింది.
4 నెలల్లో అసలు తిరిగి వచ్చేస్తున్నందున సంధ్య శివపార్వతి, హుస్సేన్ వలీ రూ.1.2 లక్షల చొ్ప్పున పెట్టుబడి పెట్టారు. వీరికి శివపార్వతి చెప్పినట్లే డబ్బు తిరిగి వచ్చింది. దీంతో రెట్టింపు లాభాల ఆశతో బాధితులు తమ ఇళ్లు, ఆస్తి పత్రాలు తనఖా పెట్టి టీపీఎఫ్ కంపెనీలో పెట్టబడులు పెట్టారు. ఖాతాదారులు పెరగడంతో నిందితులు శివపార్వతి, నవీన్ కలిసి నల్లపాడులో టీపీఎఫ్ కార్యాలయం ప్రారంభించారు. ఆ పక్కనే ప్లేవర్స్ ఓషన్ అనే ఐస్ క్రీమ్ కంపెనీని ప్రారంభించారు. టీపీఎఫ్ కంపెనీలో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా ఐస్ క్రీమ్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని మెలిక పెట్టారు. జిల్లా డిస్ట్రిబ్యూషన్కు రూ.25 లక్షలు, మండలానికి రూ.5 లక్షలు చెల్లించాలని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో టీపీఎఫ్ ఖాతాదారుల్లో శివపార్వతి రూ.25 లక్షలు చెల్లించి పెట్టుబడి పెడితే పల్నాడు జిల్లా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరు కలిసి తమకు తెలిసిన వారి ద్వారా రూ.80 లక్షలు ఆ ఇద్దరికి సమర్పించారు.
2023లో ప్రారంభమైన ఈ సంస్థ తొమ్మిది నెలలపాటు ఖాతాదారులకు సక్రమంగానే డబ్బు చెల్లించింది. ఈ విషయం ప్రజల్లో బాగా ప్రచారమవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిసా, తమిళనాడు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. ఇలా దాదాపు రూ.200 కోట్లు వరకు వసూలు చేసిన కంపెనీ 10 నెలలుగా ఎవరికీ డబ్బు చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తమ డబ్బు విషయమై నిందితుడు నవీను బాధితులు ప్రశ్నిస్తే కంబోడియా, ఇండోనేషియాలో ఉన్నానంటూ తప్పించుకుతిరుగుతున్నట్లు గుంటూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు వందల్లో ఉండటంతో పోలీసులు ఈ ఫిర్యాదును సవాల్ గా తీసుకున్నారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు.