'ప్రైవేటు' రాజ్యంలో అవినీతి భోజ్యం: బాబుకే ఎఫెక్ట్..!
కొన్ని చోట్ల మందు బాబులు షాపుల యజమానులతో గొడవలకు దిగుతున్నారు.
మద్యం షాపులను ప్రైవేటుకు ఇచ్చేశారు. ప్రభుత్వం నిర్వహించడం భారంగా ఉందన్న కారణంతోపాటు.. ప్రభుత్వం మద్యం అమ్మడం సరికాదన్న సూత్రాలతో ప్రైవేటుకు ఈ సామ్రాజ్యాన్ని కట్టబెట్టారు. అయితే.. దీనిలో లోపాలు.. ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడంలో మాత్రం సర్కారు ముందుగా దృష్టి పెట్టలేదు. దీంతో ప్రారంభించిన రెండు రోజుల్లోనే అనేక విమర్శలు.. వివాదాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. కొన్ని చోట్ల మందు బాబులు షాపుల యజమానులతో గొడవలకు దిగుతున్నారు.
దీనికి ఒకే ఒక్క కారణం.. సర్కారు ఎంఆర్‌పీ ధరలకే మద్యాన్నివిక్రయిస్తామని చెప్పడం. కానీ, షాపుల్లో క్వార్టర్ బాటిల్‌కు రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. హాఫ్ బాటిల్‌పై 20, ఫుల్ బాటిల్‌పై రూ.50 వరకు అదనంగా తీసుకుంటున్నారు.ఇలా వసూలు చేయడాన్నికొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ప్రశ్నిస్తున్న వారితోనే వివాదాలు వస్తున్నాయి. అయినా.. యజమానులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గుంటూరులో రెండు షాపుల పై పోలీసులకు ఫిర్యాదుల వరకు విషయం వెళ్లింది.
అయినా.. పోలీసులు పట్టించుకోలేదు. తమకు సంబంధం లేదని ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదులు చేయాలని తప్పించుకున్నారు. కానీ, అక్కడ కూడా సరైన సమాధానం లేదు. దీనికి కారణం..ఎక్కడికక్కడ పెరిగిపోయిన కమీషన్ల బాగోతం! ఎమ్మెల్యేల నుంచి ఎంపీల వరకు నగరాల్లో.. పంచాయతీల నుంచి జిల్లా పరిషత్‌ల వరకు గ్రామీణ స్థాయిలో నాయకులు వాటాలు వేసుకుని కమీషన్లు నిర్ణయించారు. కానీ, షాపు యజమానికి వచ్చే లాభంలో వీరికి కమీషన్లు పంచితే.. వచ్చే లాభం నిల్. దీంతో వారు ధరలు పెంచేశారు.
రూ.180 ఉన్న క్వార్టర్ బాటిల్‌ను రూ.190 నుంచి 200ల వరకు రద్దీని బట్టి, సరుకు, బ్రాండు డిమాండును బట్టి వసూలు చేస్తున్నారు. ఇది పైకి 10, 20 లాగే కనిపించినా.. ప్రజల్లో మాత్రం వ్యతిరేకత వచ్చేందుకు దారి తీస్తోంది. ఎంఆర్ పీ అని ప్రభుత్వం ప్రకటించిన దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఇలా వసూళ్లకు పాల్పడుతుండడాన్ని మెజారిటీ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక, పోలీసు, ఎక్సైజ్ సహా నాయకులకు కమీషన్లు ఇవ్వాలంటే ఆ మాత్రం తీసుకోవాలని యజమానులు చెబుతున్నారు.
వీరే కాదు.. నాయకులు నిర్వహించే కార్యక్రమాలకు నిధుల ఏర్పాటు, పార్టీలకు కూడా ఉచితంగా పంపిణీ వంటివి కూడా తమపైనే పడుతున్నాయని వారు చెబుతున్నారు. సో.. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు సమీక్షించి.. కట్టడి చేయాల్సి ఉంది. లేకపోతే.. అవినీతి పెరిగి.. మద్యం విధానం మరో ఇసుక మాదిరిగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.