సర్దుమణగని తమ్ముళ్లు.. టికెట్ల కోసం పోరు.. చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన
దీంతో వారు ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో అసెంబ్లీ టికెట్ల ప్రకటన దాదాపు పూర్తయింది. పొత్తులో భాగంగా 144 సీట్లు ఈ పార్టీ తీసుకుంది. ఇప్పటికే 128 సీట్లను ప్రకటించారు. మరో 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో కొన్ని చోట్ల (ఉదాహరణకు పిఠాపురం) తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని చంద్రబాబు తన ఇంటికి పిలిచి మరీ బుజ్జగించా రు. అయినప్పటికీ.. కొన్ని కొన్ని స్థానాల్లో తమ్ముళ్లు రగిలిపోతున్నారు. దీంతో వారు ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా తన అనుచరులతో కలిసి వచ్చి.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. కదిరి టికెట్‌ను తనకు ఇవ్వాలని ఆయన ఆందోళన చేశారు. దీంతో చంద్రబాబు ఆయనను పిలిచి చర్చించారు. పార్టీ ఇప్పటికే టికెట్లు ఖరారు చేసినట్టు చెప్పారు.
పార్టీ లైన్ మీరితే వేటు తప్పదని హెచ్చరించారు. అయితే.. తనకు కదిరి సీటు ఇవ్వకపోతే.. కనీసం తన సతీమణికి మైనారిటీలు ఎక్కువగా ఉన్న హిందూపురం పార్లమెంటు సీటునైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. ఇది కూడా సాధ్యం కాదని. గ్రాఫ్ బాగోలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు చాంద్ బాషా సిద్ధమయ్యారు. 2014లో చాంద్ బాషా కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున టికెట్‌దక్కించుకుని విజయం సాధించారు. అయితే.. 2017-18 మధ్య ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పదవి ఇస్తానన్నారని, అందుకే తాను పార్టీ మారానని అప్పట్లో ఆయన చెప్పారు. అయితే.. ఇది సాధ్యం కాలేదు. ఇక, 2019 ఎన్నికల్లోనూ కదిరి టికెట్‌ను చంద్రబాబు ఇవ్వలేదు. ఈ టికెట్‌ను పార్టీ సీనియర్ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్‌కు అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయనపై కేసులు ఉన్ననేపథ్యంలో ఆయన సతీమణికి ఇచ్చారు. ఇదే వివాదానికి దారితీసింది.