అయ్యో.. పేర్ని ఒంటరి అయిపోయావా?
మచిలీపట్నంలో బియ్యం అక్రమ తరలింపు కేసు మాజీ మంత్రి పేర్నిని గుక్క తిప్పుకోనీయడం లేదు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పార్టీలో ఒంటరి అయిపోయారా? బియ్యం అక్రమ తరలింపు కేసులో ఇరుక్కున్న నానికి మద్దతుగా ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణమేంటి? మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏ సమయంలోనైనా వైసీపీ తరఫున గట్టిగా గళం వినిపించిన పేర్ని.. ఇప్పుడు తగిన అండ కోసం ఎదురుచూడాల్సివచ్చిందా? అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది.
మచిలీపట్నంలో బియ్యం అక్రమ తరలింపు కేసు మాజీ మంత్రి పేర్నిని గుక్క తిప్పుకోనీయడం లేదు. ఒకప్పుడు పార్టీ కోసం గొంతు చించుకున్న ఆయనకు వైసీపీ నుంచి తగిన అండ లభిస్తున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. దీనికి కారణం బియ్యం కేసులో పేర్ని అడ్డంగా బుక్ అయిపోవడమే.. తన భార్య పేరిట ఉన్న గోడౌనులో దాదాపు 7,556 బియ్యం బస్తాలు మాయం కావడం, దీనిపై జరిమానా చెల్లించడంతో నాని తప్పు అంగీకరించినట్లైందని అంటున్నారు. దీంతో ఆయనకు మద్దుతుగా పార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఎదురైందంటున్నారు.
అధికారంలో ఉండగా, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆశించని పేర్ని, తమ గోడౌన్లో బియ్యం వ్యవహారం బయటపడక ముందు.. కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనపైనా విమర్శలు గుప్పించారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ ఆదేశాలు అమలు కాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే కర్మ రిటర్న్స్ అన్నట్లు డిప్యూటీ సీఎంను విమర్శించిన రెండు మూడు రోజులకే తన గిడ్డంగిలో బియ్యం భాగోతం బయటపడటంతో పేర్ని షాక్ అయ్యారు.
పేర్ని భార్యతోపాటు ఆయన కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన ప్రభుత్వం పెద్దగా కష్టపడకుండానే పేర్ని తప్పుచేసినట్లు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. బియ్యం తూకంలో తేడా వచ్చినట్లు మొదట్లో కథలు చెప్పిన నాని, రూ.1.70 కోట్లు జరిమానాగా చెల్లించడంతో నేరం అంగీకరించినట్లైందని అంటున్నారు. ఇదే అదునుగా ఆయన అక్రమాలు అన్నింటిని వెలికి తీస్తామంటూ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రధానంగా పేర్ని రాజకీయ ప్రత్యర్థి మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
బియ్యం కేసుతో పాటు మైనింగ్, పోర్టు భూముల ఆక్రమణ వంటి అభియోగాలు, ఆరోపణలతో పేర్ని నాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ, ఆయనకు మద్దతుగా పార్టీలో ఎవరూ గొంతు విప్పడం లేదు. తప్పుచేశారో? లేదో? కోర్టులో తేలుతుంది, కానీ పేర్ని విషయంలో ఆయన తప్పుచేసినట్లు వైసీపీ వ్యవహరిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో అధినేత జగన్ కూడా పట్టించుకోలేదని పేర్ని అనుచరులు మదనపడుతున్నారు. తమ నేత ఒంటరి అయ్యారని, ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని వాపోతున్నారు. పార్టీ నుంచి అండ లభించకపోవడం వల్లే సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేలా తన భార్య విషయంలో పేర్ని మాట్లాడాల్సివచ్చిందని చెబుతున్నారు. తన భార్య జయసుధను జైలుకు పంపే విషయంలో చంద్రబాబు అడ్డు చెప్పడం వల్లే బెయిల్ వచ్చిందని పేర్ని చెబుతున్నారు. కేసులో తనను జైలుకు పంపినా భరిస్తానని, కానీ, ఆడవాళ్లు విడిచిపెట్టాలని ఆయన బహిరంగంగా వేడుకోవాల్సివచ్చింది. అదే పార్టీ నేతల అండ ఉంటే పేర్ని ఇంత బేళగా మాట్లాడేవారు కాదని.. తాను ఒంటరి అయ్యాయనని గ్రహించాకే మీడియా ముఖంగా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాల్చివచ్చిందని విశ్లేషిస్తున్నారు.