విశాఖ మీద బాబు స్పెషల్ ఫోకస్

అయితే విశాఖ రాజధాని అవుతుందని మొదట్లో జనాలు కొంత అనుకూలంగా స్పందించినా ఆ తరువాత మాత్రం ఆసక్తిని చూపించలేదు.

Update: 2025-01-05 04:16 GMT

విశాఖపట్నం ఏపీకి పరిపాలనా రాజధాని అని వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ళ కాలంలో చెప్పుకొచ్చింది. కానీ ఆచరణలో అయితే అది జరగలేదు దానికి న్యాయపరమైన అవరోధాలు అని వైసీపీ నేతలు చెప్పవచ్చు. అయితే విశాఖ రాజధాని అవుతుందని మొదట్లో జనాలు కొంత అనుకూలంగా స్పందించినా ఆ తరువాత మాత్రం ఆసక్తిని చూపించలేదు.

దానికి కారణం ఈ ప్రకటన వెనక నిబద్ధత ఎంత వరకూ ఉంది అని ఆలోచించడం వల్లనే. ఇదిలా ఉంటే గతంలో కూడా విశాఖ విషయంలో టీడీపీ ప్రభుత్వం కొంత ఆలోచన చేసిన ఈసారి మాత్రం ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే విశాఖకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తోంది అని అంటున్నారు విశాఖను ఎంతలా అభివృద్ధి చేస్తే అంతలా ఏపీకి ఆర్ధిక వనరులు సమకూరుతాయని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అందుకే మెట్రో రైలు ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించబోతోంది.

విశాఖకు మెట్రో రైలుని తీసుకుని వస్తామని బాబు తాజా పర్యటనలో హామీ ఇచ్చారు. విశాఖను టెక్నాలజీ హబ్ గా రూపొందిస్తామని ఆయన చెప్పారు. విశాఖని ఆర్ధిక రాజధానిగా కూడా చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా రైల్వే జోన్ కి శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా విశాఖలో ఎన్నో పరిశ్రమలు కొత్తగా రాబోతున్నాయి. దాంతో విశాఖ దశ తిరుగుతుందని అంటున్నారు.

ఏపీకి రాజధానిగా అమరావతిని చేసినా కూడా విశాఖ ప్రాధాన్యత దానికి ఉంటుందని ఈ సిటీ ఏపీలో మరో రాజధానిగా అభివృద్ధి చెందుతుందని కూటమి పాలకులు భరోసా ఇస్తున్నారు అందులో భాగమే అనేక కార్యక్రమాలను తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు.

విశాఖ అన్నది మినీ ఇండియాగా ఉంది. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల కోసం విశాఖ వచ్చిన వారు ఉన్నారు. దాంతో ఈ కాస్మోపాలిటిన్ కల్చర్ ని మరింతగా వాడుకుంటూ దేశంలోనే మహా నగరాల సరసన నిలపాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు విషయానికి వస్తే విశాఖ మీద ఆయన తొలి నుంచి ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. ఈసారి ఆయన విశాఖ డెవలప్మెంట్ ని పూర్తి బాధ్యతగా తీసుకున్నారు. విశాఖ ఉత్తరాంధ్రకు గేట్ వేగా ఉంది. విశాఖ బాగు పడితీఅ ఉత్తరాంధ్ర జిల్లాలలో వెనకబాటుతనం కూడా రూపుమాసిపోతుందని అంటున్నారు.

ఇక ఉమ్మడి విశాఖ లో కొత్తగా రానున్న పరిశ్రమలకు అలాగే పెరుగుతున్న జనాభాకు దాహార్తిని తీర్చేందుకు గోదావరి జిలాలను తీసుకుని వస్తామని బాబు చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి జలాలు వస్తాయని వచ్చే ఏడాది విశాఖకు వస్తాయని ఆయన చెప్పారు. మొత్తానికి విశాఖకు ఏమి కావాలో అవన్నీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News