బెంగళూరులో టెక్కీ ఫ్యామిలీ ఆత్మహత్య... తెరపైకి షాకింగ్ విషయాలు!
ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. శనివారం చాలా నార్మల్ గా కనిపించిన వీరు.. సోమవారం ఉదయానికి విగతజీవులుగా పడి ఉండటాన్ని పనిమనిషి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు! పని ఒత్తిడి కొందరి ఆత్మహత్యలకు కారణం అవుతుంటే.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మరికొంతమంది పెను సమస్యలుగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టెక్కీ ఫ్యామిలీ ఆత్మహత్య ఘటన బెంగళూరులో కలకలం రేపింది.
అవును... బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ఇద్దరు పసి పిల్లలకు చంపి అనంతరం అతని భార్య, అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. శనివారం చాలా నార్మల్ గా కనిపించిన వీరు.. సోమవారం ఉదయానికి విగతజీవులుగా పడి ఉండటాన్ని పనిమనిషి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన అనూప్ (38).. తన భార్య రాఖీ (35), పిల్లలు అనుప్రియ (5), ప్రియాంష్ (2) తో కలిసి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అనూప్ కుమార్తె అనుప్రియ ప్రత్యేక అవసరాలు గల బిడ్డ కావడంతో.. ఆమె విషయంలో తల్లితండ్రులు ఇద్దరూ బెంగగా ఉండేవారంట.
ఈ విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు తెలిపారు. ఇదే సమయంలో శనివారం రాత్రి వరకూ కూడా పరిస్థితులు చాలా నార్మల్ గా ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం ఇంటి పని నిమిత్తం వెళ్లిన పనిమనిషికి లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
ఈ దంపతుల పెద్ద కుమార్తె అనుప్రియ పరిస్థితి చూసి మనస్థాపానికి గురై వారు తమ జీవితాలను అంతం చేసుకోవాలని నిర్ణయించుకుని ఉంటారని.. అంతకంటే ముందు తమ పిల్లల జీవితాలను ముగించాలని నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలుత పిల్లలకు ఆహారంలో విషమిచ్చి.. ఆ తర్వాత వీరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు!
ఈ నేపథ్యంలో... సదాశివనగర్ పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో వీరు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కుమార్తె పరిస్థితే కారణమా.. లేక, ఆర్థిక చితికిపోయిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా... 2023 ఆగస్టు లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ విజయ్ (31).. తన భార్య హేమావతి (29), 18 నెలలు, 8 నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన బెంగళూరులోని కడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.