నన్ను-నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు: పవన్
హిందీ భాష విషయంలో జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.;
హిందీ భాష విషయంలో జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి భజన చేస్తున్నారంటూ.. డీఎంకే నాయకులు దుయ్యబట్టారు. కేంద్రం సాగిస్తున్న పెత్తందారీ తనానికి వ్యతిరేకంగానే తాము పోరాటం చేస్తున్నామని.. ఈ విషయంలో కుదిరితే కలిసి రావాలని.. లేకపోతే ఆ పార్టీకి వాయిస్‌గా ఉండాలని వారు చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తన వ్యాఖ్యలను కూడా తప్పుగానే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం `ఎక్స్`లో సుదీర్ఘ పోస్టు చేసిన పవన్ కల్యాణ్.. తాను భాషా స్వాతంత్య్రానికి, విద్యా స్వేచ్ఛకు కట్టుబడిన వ్యక్తినని స్పష్టం చేశారు. అయితే.. ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడాన్ని మాత్రమే తాను తప్పుబడుతున్నానని చెప్పారు. ``ఒక భాషను బలవంతంగా రుద్దడం.. లేదా గుడ్డిగా ఒక భాషను వ్యతిరేకించడం అనే దానిని నేను వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండూ తప్పేనని నా వ్యక్తిగత అభిప్రాయం`` అని పేర్కొన్నారు. ఈ రెండు కూడా.. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కూడా విరుద్ధమని తెలిపారు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రతి విద్యార్థీ.. తనకు నచ్చిన రెండు భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు.
``నేను హిందీ భాషను వ్యతిరేకించడం లేదు. అయితే.. దీనిని ఖచ్చితంగా అమలు చేయాలన్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నా. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో హిందీని చేర్చలేదు. ఇది కేవలం.. అసత్య ప్రచారం మాత్రమే. దీనిని ప్రజలు కూడా తప్పుగా అర్ధం చేసుకున్నారు. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. జాతీయ విద్యావిధానం ప్రకారం.. విద్యార్థి తనకు సౌకర్యంగా ఉండే రెండు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషను కూడా నేర్చుకునే అవకాశం ఏర్పడింది. వారు ఒక వేళ హిందీ నేర్చుకునేందుకు ఇష్టపడకపోతే.. స్థానిక భాషను నేర్చుకునే అవకాశం ఉంది. లేదా భారతీయ భాషల్లో ఒకటి నేర్చుకోవచ్చు. తద్వారా వారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. భాషా స్వేచ్ఛకు, భారతీయ విద్యా విధానానికి నేను కట్టుబడి ఉన్నారు. దీనిలో రాజకీయాల ప్రమేయానికి మాత్రమే వ్యతిరేకం`` అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.