‘స్టార్ లింక్ ఇండియా’కు భారత్ లో అసలైన సవాళ్లు ఇవే!

భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు అడుగు పడింది.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను దేశంలో వినియోగించుకునేందుకు రోజులు ఎంతోదూరంలో లేవని అంటున్నారు.;

Update: 2025-03-15 20:30 GMT

భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు అడుగు పడింది.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను దేశంలో వినియోగించుకునేందుకు రోజులు ఎంతోదూరంలో లేవని అంటున్నారు. ఇప్పటికే స్టార్ లింక్ తో దేశీయ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్ టెల్, జియో ఒప్పందం చేసుకున్నాయి. ఇక స్టార్ లింక్ భారత్ లో ఓ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేసేస్తే అంతా అయిపోయినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి... ప్రకృతి వైపరిత్యాలు లేదా ప్రజల భదరతకు ముప్పు వాటిల్లడం లాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఒక ఆధీకృత సంస్థ టెలికాం సేవలు లేదా నెట్ వర్క్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రతీసారీ అమెరికాలోని ఆఫీసును సంప్రదించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్టార్ లింక్ కు భారత్ తెలిపింది.

అందువల్ల భారత్ లోనే ఒక కంట్రోల్ సెంట్రల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పినట్లు కథనాలొస్తున్నాయి. అది ఓకే అయిపోతే... ఇక సెల్ టవర్ లేకుండానే మారుమూల, పర్వత ప్రాంతాలపై సైతం ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ... స్టార్ లింక్ ఇన్స్టలేషన్, మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఛార్జెస్ విషయానికొస్తేనే... భారత్ లో దాని మనుగడపై సందేహాలు వస్తున్నాయని అంటున్నారు.

అవును... స్టార్ లింక్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. ఈ సేవల ఏర్పాటు ఖర్చు ఎక్కువనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు... స్టార్ లింక్ ఇన్ స్టలేషన్ కు సుమారు రూ.30,000 వరకూ ఖర్చవుతుండగా... నెలవారీ సబ్ స్క్రిప్షన్ సగటున రూ. 10వేలుగా ఉందని చెబుతున్నారు. ఇవి భారత్ లో భారీగా తగ్గాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఎందుకంటే... భారత్ లో టెలికాం కంపెనీలు ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంలో అన్ లిమిటెడ్ డేటాను రూ.599కే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... 25 నుంచి 220 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో పనిచేసే స్టార్ లింక్ కోసం వేలు ఖర్చు పెట్టడంపై ఏ మేరకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తారనేది వేచి చూడాలి.

అయితే... ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏమాత్రం అవకాశం లేని కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు మాత్రమే స్టార్ లింక్ సేవలు పరిమితం కానున్నాయని అంటున్నారు. మరోపక్క... శాటిలైట్ సిగ్నల్ ద్వారా డేటా అందిచాలన్నా వాతావరణం కూడా అనుకూలించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో... భారత్ లో స్టార్ లింక్ ఏ మేరకు ప్రభావం చూపబోతోందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News