బీజేపీ సీఎంని దించేద్దాం...కాంగ్రెస్ భారీ ఆఫర్!
అయితే రెండున్నరేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన షిండే ఉప ముఖ్యమంత్రి పదవిలో కుదురుకోలేకపోతున్నారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా జీవిత కాలం ఉప ముఖ్యమంత్రిగానేనా అని మధనపడుతున్నారు.;
కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ నాయకత్వం లోని మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేవేందర్ ఫడ్నవీస్ రెండవసారి సీఎం అయ్యారు. బీజేపీకి మొత్తం అసెంబ్లీలో 148 మ్యాజిక్ ఫిగర్ కి గానూ కొద్ది సీట్లు తక్కువగా 134 దాకా వచ్చాయి. మిత్రులైన ఏక్ నాథ్ షిండే శివసేనతో అలాగే అజిత్ పవార్ ఎన్సీపీతో కలసి మయాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రభుత్వంలో షిండే అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
అయితే రెండున్నరేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన షిండే ఉప ముఖ్యమంత్రి పదవిలో కుదురుకోలేకపోతున్నారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా జీవిత కాలం ఉప ముఖ్యమంత్రిగానేనా అని మధనపడుతున్నారు. అయితే బీజేపీకి దేశంలో బలం ఉంది. అంతటా విస్తరిస్తోంది. దాంతో వారు ఉందిలే మంచి కాలం అని సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. అపుడపుడు ఏక్ నాథ్ షిండే తనలోని అసంతృప్తిని బయటపెట్టుకుంటున్నారు. అజిత్ పవార్ మాత్రం ఫడ్నవీస్ తో కలసి ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో మహా రాజకీయాల్లో మంట పుట్టించే మాటను కాంగ్రెస్ వదిలింది. బీజేపీ ప్రభుత్వాన్ని దించేద్దాం, ఫడ్నవీస్ ని మాజీ సీఎం గా చేద్దాం. ఆ తరువాత చాన్స్ మీకే అంటూ ఏక్ నాథ్ షిండేని అజిత్ పవార్ ని దువ్వుతోంది. మీరు మా వైపు వస్తే ముఖ్యమంత్రులు అవుతారు అని భారీ ఆఫర్ ని కూడా ప్రకటించేసింది.
తాజాగా మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలే చేశారు. దేవేందర్ ఫడ్నవీస్ తో ఎందుకు ఇబ్బందులు పడతారు, మాతో చేతులు కలపండి మీరే అధికార పీఠాలు అనుభవించండి అంటూ ఆయన వారిని ఆకర్షించేలా కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ మీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. షిండే పవర్ లను కలుపుకుంటామని అంటున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి కలిపి 50 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఏక్ నాధ్ నాయకత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉంటే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కలిస్తే కనుక కరెక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ అయిన 148కి లెక్క సరిపోతుంది. అంటే అధికారం చేతిలోకి వచ్చేస్తుంది అన్న మాట.
మరో వైపు చూస్తే ఫడ్నవీస్ ని సీఎం గా ఏక్ నాథ్ షిండే అంగీకరించలేకపోతున్నారు అని అంటున్నారు. దానికి తగినట్లుగానే ఏక్ నాథ్ షిండే ప్రాధాన్యతను ఫడ్నవీస్ కోరి మరీ తగ్గిస్తున్నారు అని అంటున్నారు అజిత్ పవార్ కూడా ఈ రాజకీయ ఆటను జాగ్రత్తగా గమనిస్తున్నారు.
దీంతో 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన రాజకీయ విన్యాసాలు మళ్ళీ మహారాష్ట్రలో మొదలవుతాయా అందుకేనా కాంగ్రెస్ నేత నానా పటోలే ఈ రకమైన కామెంట్స్ చేసారు అని అంటున్నారు. అయితే మహాయుతిలో ఏ రకమైన విభేదాలు లేవని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్ కులే ఖండిస్తున్నారు. రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికి ఎరుక అన్నదే జనం మాట.