చంద్రబాబు, పవన్ పై శ్యామల ఫైర్ 420 కేసులు పెట్టాలంటున్న శ్యామల
కాకినాడలో సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్ మాటలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మీ హామీలను సీజ్ చేయాలని విమర్శించారు శ్యామల.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, చంద్రబాబు చేసిన తొలి సంతకాలు కూడా దిక్కులేకుండా పోయాయని వైసీపీ మండిపడుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూటమి సర్కారు హామీలపై సుదీర్ఘమైన ట్వీట్ చేయగా, మీడియా సమావేశం నిర్వహించిన అధికార ప్రతినిధి శ్యామల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాకినాడలో సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్ మాటలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మీ హామీలను సీజ్ చేయాలని విమర్శించారు శ్యామల.
ఎన్నికల్లో హామీలిచ్చి నెరవేర్చని కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలని శ్యామల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలను చంద్రబాబు మోసం చేశారని, తక్షణమే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలిచ్చి ప్రజలను వంచించారన్నారు. రాజకీయాల్లో శుష్క వాగ్దానాలు చేయకూడదనే విషయాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు.
అక్కచెల్లెమ్మలను మళ్లీ మళ్లీ మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ అందజేసిన పథకాలను నిలిపేశారని శ్యామల మండిపడ్డారు. సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకున్నారని, పవన్ కల్యాణ్తోపాటు కూటమి నేతలు అంతా ఒక పేపర్పై సంతకాలు చేసి మరీ ప్రజలను మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఊసేలేకుండా చేస్తున్నారని విమర్శించారు. మీరు ఆ రోజు పెట్టిన సంతకాలకు విలువ లేదా అంటూ శ్యామల ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఏదో రకంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో సాధ్యం కాని హామీలిచ్చారని తెలిపారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేయడమంటే ఇదేనని సామెతను రుజువు చేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారని, ఆ డబ్బు ఎప్పుడిస్తారంటూ రాష్ట్రంలోని 2.7 కోట్ల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రతినెలా రూ.1500 ఇవ్వాలంటే ఏడాదికి రూ.37,313 కోట్లు అవుతుందని, తల్లికి వందనం కింద రూ.12,450 కోట్లు అవుతుందని చెప్పిన శ్యామల ఈ రెండు పథకాల కోసం మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారని, చంద్రబాబు, పవన్ మాత్రం ఆ పథకాలు ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.