స్నేహితుడి పెద్దకర్మ రోజు కోడిపందేలు.. షాకింగ్ ట్విస్టు
విజయవాడ రూరల్ మండలంలోని నున్న
సెంటిమెంట్లు.. చట్టం ఒకే ఒరలో ఇమిడే పరిస్థితి ఉండదు. చట్టప్రకారంగా చూసినప్పుడు తప్పుగా.. సెంటిమెంట్ ప్రకారంగా చూస్తే.. వారు చేసిన దాంట్లో తప్పేముందన్నట్లుగా అనిపించే ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు.. చివర్లో ట్విస్టుకు ముక్కున వేలేసుకునే పరిస్థితి. క్రిష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల్ని అమితంగా ఇష్టపడే కొండాపి నరేంద్ర రెడ్డి ఈ మధ్యన మరణించారు.
విజయవాడ రూరల్ మండలంలోని నున్న ప్రాంతానికి చెందిన నరేంద్ర రెడ్డికి.. ఆయన స్నేహితులకు కోడి పందేలు అంటే మహా ఇష్టం. దీంతో.. స్నేహితుడి పెద్ద కర్మ రోజున.. అతగాడికి ప్రీతిపాత్రమైన కోడి పందేల్ని నిర్వహించాలని సన్నిహితులు డిసైడ్ అయ్యారు.
ఇదే విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసేలా ఫోటో పెట్టి.. సూరంపల్లి సమీపంలోని మామిడి తోటలో ఏర్పాట్లు చేశారు. పొలం గట్టు మీద కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఫోటో పెట్టిన తర్వాత పోలీసులకు సమాచారం అందకుండా ఉంటుందా?
జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో ఎస్ఈబీ టీం తోటలోని శిబిరం మీద దాడి చేసి.. కోడి పందేలు ఆడుతున్న మొత్తం 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10.9 లక్షల నగదుతో పాటు.. 8 కార్లు.. ఆరు కోళ్లు.. వాటి కాళ్లకు కట్టే 48 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. కేసు మాత్రం న మోదు చేశారు.
ఇదంతా చట్టం ప్రకారం రోటీన్ గా జరిగే వ్యవహారమే అయినప్పటికీ.. ఆ తర్వాత చోటు చేసుకున్న సీన్ చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వేళ.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి అదుపులోకి తీసుకున్న వైనం తర్వాత.. నిర్వహించిన పెద్ద కర్మలో.. మరణించిన వారికి ఫలహారాన్ని పెట్టటం.. కాకులు వచ్చి తినటం తెలిసిందే.
కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఒక్క కాకి వచ్చి కూడా పెట్టిన ఆహారాన్ని తినకపోవటం షాకింగ్ గా మారింది.పోలీసుల తీరుపై నిరసనగానే.. నరేంద్ర రెడ్డి ఆత్మ కాకి రూపంలో రాలేదని.. ఫలహారాన్ని తినలేదని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఈ ఉదంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.