ఎమ్మెల్సీ ఎన్నిక...పోటీలో కూటమి లేకుండానే ?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం విశేషం.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం విశేషం. నవంబర్ 11తో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన వేళ వైసీపీ నుంచి బొబ్బిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ కూటమి నుంచి అయితే ఎవరూ పోటీలో లేరు అని తెలుస్తోంది. అయితే విచిత్రంగా ఇప్పటిదాకా ఈ స్థానానికి ఎమ్మెల్సీగా పనిచేసిన ఇందుకూరి రఘురాజు సతీమణి ఇందుకూరి సుధారాణి ఇండిపెండెంట్ గా తన నామినేషన్ ని దాఖలు చేశారు.
దాంతో ఇది కూటమి వెనక నుంచి ఆమె చేత నామినేషన్ వేయించిందా అన్న చర్చ సాగుతోంది. అదే టైంలో ఇందుకూరి రఘురాజు సొంతంగా నిర్ణయం తీసుకుని తన సతీమణిని బరిలో నిలబెట్టారా అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది.
నిజానికి కూటమి తరఫున గట్టి పోటీ లేకపోతే శంబంగి విజయం సునాయాసం అవుతుంది. కానీ చివరి రోజు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి. ఈ ఇద్దరు ఇండిపెండెంట్లూ కూడా ఎస్ కోట నియోజకవర్గం నుంచే ఉండడం విశేషం.
వారిలో ఒకరు ఈ సీటుకు ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి. ఆమె ఎస్ కోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన వారు. ఆమె ఆఖరు నిముషంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
అదే విధంగా ఎస్ కోట మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలుస్తొంది. దీంతో ఈ ఇద్దరూ పోటీకి సిద్ధంగా ఉన్నారని ఎవరూ ఉపసంహరించుకునే చాన్స్ లేదని అంటున్నారు. పైగా ఇందుకూరి రఘురాజు సతీమణి నామినేషన్ వేశారు అంటే వెనక రఘురాజు ఉంటారని అంటున్నారు.
ఇక నామినేషన్ల స్క్రూటనీ మంగళవారం జరగనుంది. ఆ తరువాత నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆఖరుకు ఎవరు పోటీలో ఉండేది తేలుతుంది. టీడీపీ కూటమి పోటీలో లేకపోవడం వైసీపీకే అత్యధిక ఓట్లు ఉండడంతో శంబంగి విజయం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.