ఆశలు ఇంకా ఉన్నాయంటున్న యనమల

ఇక యనమల విషయం చూస్తే ఆయన ఇపుడు ఏ చట్ట సభలోనూ సభ్యుడు కారు. తాజాగా అయిదు ఎమ్మెల్సీ సీట్లు శాసనమండలిలో ఖాళీ అయితే అయిదూ భర్తీ అయ్యాయి.;

Update: 2025-03-14 10:03 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. ఆయన 1983 నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా పార్టీలో మేధావి వర్గం ప్రతినిధిగా అన్ని విధాలుగా యనమల కనిపిస్తారు.

వీటికి మించి ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. బాబు యనమల మధ్య అరమరికలు లేని స్నేహం ఉంది. బాబు సీఎం అయితే యనమల ఆర్ధిక మంత్రిగా పక్కన ఉండాల్సిందే. అయితే ఈ సంప్రదాయం తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో లేకుండా పోయింది.

ఇక యనమల విషయం చూస్తే ఆయన ఇపుడు ఏ చట్ట సభలోనూ సభ్యుడు కారు. తాజాగా అయిదు ఎమ్మెల్సీ సీట్లు శాసనమండలిలో ఖాళీ అయితే అయిదూ భర్తీ అయ్యాయి. అందులో యనమల సీటు కూడా ఉంది. ఆ విధంగా ఆయన ఈ నెలాఖరులో మండలి నుంచి సీనియర్ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్నారు

మరి యనమల రాజకీయం ఏ విధంగా సాగుతుంది, ఆయన ఏమి చేయబోతారు అన్నది అందరిలోనూ ఉన్నవే. రాజకీయ వర్గాలలో అయితే యనమలకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం ఒక పెద్ద చర్చగానే ఉంది. దానికి బదులు యనమలే చెప్పేశారు. అసెంబ్లీ లాబీలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు రాజకీయ జీవితం గురించి వివరించారు.

తనకు పార్టీ రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియచేశారు. ఇక తాను ఎమ్మెల్సీగా రిటైర్ అయినట్లే అన్నారు. అదే సమయంలో తనకు రాజ్యసభకు వెళ్ళాలని ఉందన్న కోరికను పెద్దాయన బయటపెట్టారు. భవిష్యత్తులో పార్టీ తనకు ఆ అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యుడు అవుతాను అని ఆయన అన్నారు.

అది కాదూ కూడదు అనుకుంటే ఇక రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అయి విశ్రాంత జీవితం గడుపుతాను అని ఆయన చెప్పారు. పదవీ విరమణ తరువాత ఏమి చేస్తారు అని తనను అడుగుతున్న శ్రేయోభిలాషులు, మిత్రులకు తాను ఇదే చెబుతున్నాను అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన రోజున చంద్రబాబు తనకు ఫోన్ చేసి అన్నీ చెప్పారని అభ్యర్ధుల ఎంపికను తాను స్వాగతించానని యనమల చెప్పడం విశేషం. ఇదే సందర్భంలో ఆయన మరో కామెంట్ కూడా చేశారు. రాజకీయాలు ప్రస్తుతం చాలా ఖరీదు అయిపోయాయని అన్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచివి కానే కాదని అన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే యనమల ఆశలు రాజ్యసభ సీటు మీద ఉన్నాయని తెలుస్తోంది. 2026లో ఏపీ నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ అవుతాయి. మరి ఇందులో యనమలకు ఒకటి ఇస్తారా అన్నది చర్చగా ఉంది. టీడీపీలో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు కొత్త వారికి చాన్స్ ఇచ్చే పద్ధతి సాగుతోంది. దాంతో యనమల ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయన్నది చూడాలి. ఏది ఏమైనా యనమల అయితే ఈ నెలాఖరు నుంచి ఏ చట్ట సభలోనూ సభ్యుడు కారు అన్నది అయితే రూఢీగా తెలుస్తున్న విషయం.

Tags:    

Similar News