ఆగస్టు 5లోపు దాటకుంటే ఏడాది ఆగాలి

Update: 2015-06-26 04:21 GMT
అద్భుత సాంకేతికతను ఆవిష్కరిస్తూ.. సోలార్‌ విమానాన్ని తయారు చేయటం తెలిసిందే. సూర్యరశ్మి సాయంతో నడిచే విమానం ఒక అద్భుతంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం ఇదే విమానంలో చుట్టి రావటం ద్వారా ఈ విమానసామర్థ్యాన్ని ప్రాక్టికల్‌గా చూసుకునే పనిని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ మధ్యన ఇదే విమానం తన ప్రపంచ పర్యటనలో భాగంగా జైపూర్‌కి వచ్చి వెళ్లటం తెలిసిందే. అలా ప్రతి దేశంలోనూ వెళ్లిన సోలార్స్‌ ఇంపల్స్‌ ఫ్లైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా జపాన్‌లో నిలిచిపోవటం తెలిసిందే.

తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. జపాన్‌లో ప్రస్తుతం నిలిచిపోయిన ఈ విమానం కనుక ఆగస్టు 5 లోపు పసిఫిక్‌ మహాసముద్రం దాటకుంటే.. మరో ఏడాది పాటు ఈ విమానాన్ని జపాన్‌లోనే ఉంచేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

తనకున్న సామర్థ్యంతో నిర్విరామంగా పది గంటలు ప్రయాణించే సత్తా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ప్రయాణించే అవకాశం లేదని.. ఈ నేపథ్యంలో పసిఫిక్‌ మహాసముద్రాన్ని ఆగస్టు 5లోపు దాటేయాల్సి ఉంటుందని పైలెట్‌ చెబుతున్నారు. పసిఫిక్‌ మహా సముద్రం ఉపరితలంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆగస్టు 5 తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని.. ఈ నేపథ్యంలో అయితే ఆగస్టు 5లోపున లేదంటే ఏడాది తర్వాతనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఈలోపు విమానానికి ఉన్న సాంకేతిక సమస్యలు పూర్తి చేస్తారా?.. ఆగస్టు 5లోపు పసిఫిక్‌ మహాసముద్రాన్ని ఈ సోలార్‌ విమానం దాటేస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News