అమెరికాపై అక్రమంగా కాలుమోపని తెలుగోడు.. డిపోర్టేషన్ జాబితానే సాక్ష్యం
అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారో లేదో.. డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్ (అక్రమ వలసదారుల తరలింపు) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది
అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారో లేదో.. డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్ (అక్రమ వలసదారుల తరలింపు) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఆ దేశం వారు ఈ దేశంవారు అని చూడకుండా అక్రమం ఉంటున్నవారందరినీ బలవంతంగా విమానాలు ఎక్కించి మరీ అమెరికా నుంచి పంపేస్తున్నారు. ఎవరు జోక్యం చేసుకున్నా ఆగేది లేదంటూ సైనిక విమానాల్లో సంకెళ్లు వేసి వారి స్వదేశాల్లో దింపేస్తున్నారు.
అమెరికా నుంచి 104 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం ఈ నెల 5న ఒకటి వచ్చిన సంగతి తెలిసిందే. 116 మందితో ఈ నెల 15న రెండో విమానం, 112 మందితో మూడో విమానం అమృత్ సర్ లో ఆదివారం రాత్రి ల్యాండ్ అయింది.
అమెరికా నుంచి ఇప్పటివరకు 332 మంది అక్రమ వలసదారులు స్వదేశానికి చేరారు. వీరిలో పంజాబీలే 126 మంది ఉన్నారు. దీనికి పొరుగు రాష్ట్రమైన హరియాణకు చెందినవారు 110, గుజరాత్ వారు 74, యూపీ 6, మహారాష్ట్ర 5, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గోవా, చండీగఢ్ కు చెందినవారు ఇద్దరు చొప్పున, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
తెలుగువారున్నారా?
అమెరికా తరిమేసిన అక్రమ వలసదారుల్లో ఇప్పటివరకు ఇక్కరు తెలుగువారు లేరు. అంటే.. మనవారంతా సక్రమ పద్ధతుల్లో, సరైన పత్రాలతో అమెరికా గడ్డపై కాలుమోపుతున్నారని భావించవచ్చు. అంతేకాదు.. ఇప్పటివరకు వచ్చినవారంతా ఉత్తర భారత దేశం వారే కావడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలవారు ఒక్కరూ లేపోవడం విశేషం. అయితే, ఇప్పటివరకు లేనందున ఇకపై కూడా ఉండరని భావించడం సరైనది కాదు. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మాస్ డిపోర్టేషన్ లో తెలుగోళ్లు ఒకరిద్దరైనా దొరికితే అది ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బహుశా అలా జరగదనే అభిప్రాయం వినిపిస్తోంది.